27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ! | 27 Years in America Green Card Holder Vasamsetty Detained by ICE | Sakshi
Sakshi News home page

27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!

Aug 18 2026 12:23 PM | Updated on Aug 18 2026 12:28 PM

27 Years in America Green Card Holder Vasamsetty Detained by ICE

అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్‌) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్‌ కేసును ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.

వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ  చెక్‌-ఇన్‌కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్‌ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లా‌ఫుల్‌ పర్మనెంట్‌ రెసిడెంట్‌ (LPR) హోదా ఉంది.

క్రిమినల్‌ రికార్డ్‌ లేదు..
వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్‌ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్‌ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.

ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్‌కార్డ్‌ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.

ఏడు నెలలు భారత్‌లో ఉన్నందుకేనా?
వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్‌ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. 

మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్‌లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్‌కార్డ్‌ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.

‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’
అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్‌కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్‌లో ఉన్న సమయంలోనే నార్త్‌ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.

కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టు
వాసంశెట్టిపై అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్‌ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్‌ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్‌-ఇన్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్‌-ఇన్‌కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

‘ఆమె గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ కాదు’
వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్‌ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఆదేశించారు.

తర్వాత ఏం జరగొచ్చు?
తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్‌పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్‌ జడ్జి ఎదుట బాండ్‌ హియరింగ్‌ జరిగే అవకాశం ఉంది.

27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్‌కార్డ్‌ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్‌కార్డ్‌ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement