కరీంనగర్‌రూరల్: భార్య వేధింపులు భరించలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తీసుకరావాలని, తల్లిదండ్రులను కలువకూడదంటూ మానసికంగా హింసించడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఆరోపిస్తున్నాడు. కరీంనగర్‌రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి(హవేలి)కి చెందిన కళ్యాణం రవి కుమారుడు రాకేశ్(27) హైదరాబాద్‌కు చెందిన సంజన అలియాస్ వర్షను 2024లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
తీగలగుట్టపల్లిలోని సరస్వతినగర్‌లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులను కలవకుండా రాకేశ్‌ను సంజనా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. సెల్‌ఫోన్‌లో సైతం మాట్లాడకుండా వేధింపులకు గురిచేయడంతో భరించలేక రాకేశ్ శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి..
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కాసర్ల వెంకటేశ్(38)అనే కాంట్రాక్ డ్రైవర్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓసీపీ–5లో కాంట్రాక్ట్ వోల్వో డ్రైవర్‌గా వెంకటేశ్ పనిచేస్తున్నాడు.ఎడాది క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మద్యానికి బానిసై విధులకు పోవడంలేదు. భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత భార్య మరోగదిలో తన అత్తవద్ద పిల్లలలో కలిసి నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున వెంకటేశ్ తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. పని చేయకుండా, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి భార్య స్వరూప ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
జీవితంపై విరక్తితో వివాహిత..
మానకొండూర్: మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన దావల్ల భాగ్యలక్ష్మి (45) జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. భాగ్యలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతోంది. చాలా ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం కుదుట పడలేదు. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. ఆదివారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా భాగ్యలక్ష్మి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


