మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు.
ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
ఇక 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్‌ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్‌లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్‌ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్‌ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు.
కాగా 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది.


