breaking news
bermuda triangle
-
బెర్ముడా ట్రయాంగిల్..ముక్కోణపు సుడిగుండం!
ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్‌లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.మీథేన్ తప్ప మిస్టరీ కాదు!బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్‌లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది! సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!త్రిభుజాకార ప్రమాద స్థలిసినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్‌లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్‌జువాన్.. ఈ మూడు పాయింట్లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?ఎందుకు మునుగుతున్నాయి!‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం. ఇప్పుడెందుకు అలా లేదు?! అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది. మీథేన్ కథ కూడా గ్యాసేనా?సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్‌లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు. నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?! ఐదు శతాబ్దాల మిస్టరీ!బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేసేశాయి.లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధనప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.సాక్షి, స్పెషల్ డెస్క్ -
Bermuda Triangle: మాయమైతే.. పైసలు వాపస్
న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్ మిస్టరీస్’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ‘బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనిపించకుండా పోతే మీ డబ్బు 100% వాపస్ ఇస్తాం’అనిప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నార్వేజియన్ ప్రిమా షిప్ న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్‌తోనే తయారైందని చెప్పింది. క్యాబిన్ టికెట్ ఖర్చు ఒక్కరికి 1830 డాలర్లపైనే అని తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలోని 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లిన 75 విమానాలు వందల సంఖ్యలో ఓడలు కనిపించకుండా పోయాయి. -
విమానాలు మునిగిపోవడానికి కారణమేంటి..?
-
బెర్ముడా ట్రయాంగిల్.. మిస్టరీ వీడింది
‘బెర్ముడా ట్రయాంగిల్’.. ఎంతో కాలం నుంచి శాస్త్రవేత్తలకు పెను సవాలుగా.. సామాన్యులకు అత్యంత ఆసక్తికరంగా.. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మృత్యు శాసనంగా మారింది. అసలు ఏముంది అక్కడ, ఇన్ని ఓడలు మునిగిపోవడానికి కారణమేంటి..? ఏలియన్లా.. లేక ఏదైనా బ్లాక్ మ్యాజికా.. ఇన్నాళ్లుగా సామన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా ఆలోచింపచేసిన ఈ మిస్టరీకి సమాధానం దొరికిందంటున్నారు సైంటిస్టులు. బెర్ముడా ట్రయాంగిల్ ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం ఏలియన్‌లో, కృష్ణబిలాలో కాదంట. మరి ఏంటి అనుకుంటున్నారా.. ‘అలలు’. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కేవలం అలల వల్లనే ఈ ప్రాంతం ఇంత ప్రమాదకరంగా మారిందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం అన్నాక అలలు సహజం. మరి ఏ సముద్రంలోనూ ఇలాంటి విపరీతాలు జరగడం లేదు కదా అంటే.. ఇక్కడ పుట్టే అలలు మాములు అలలు కాదంట. భారీ ఎత్తులో అంటే దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉద్భవించే అలలే ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. వీటికి ‘రోగ్ వేవ్స్’గా నామకరణం చేశారు. ఎక్కడుంది బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. మృత్యువుకు మారు పేరుగా, ఓడలకు మరణశాసనంగా మారింది ఈ ప్రాంతం. అప్పటి వరకూ బాగానే ఉన్న వాతావరణ పరిస్థితులు బెర్ముడా వద్దకు చేరగానే ఒక్కసారిగా తారుమారవుతాయి. అసలు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గత వందేళ్లలో దాదాపు 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు అక్కడ గల్లంతయ్యాయి. ఈ రాకాసి ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు వెయ్యిమందిని తనలో కలుపున్నట్లు సమాచారం. ఏలియన్లా.. కృష్ణబిలాలా..? ఓడలు, విమానాలు గల్లంతువుతున్నాయి. ఆపైన వాటి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు. అసలు దీనంతటికి కారణం ఏంటి..? అనే అంశంపై ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమంటే.. మరి కొందరు ఏలియన్లు కారణమని వాదించారు. అయితే ఇవేవీ నిజం కాదని అసలు నిజం వేరే ఉందని ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ చానెల్5 వెల్లడించింది. ఈ రహస్యాన్ని చేధించే క్రమంలో పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ఎన్నో ప్రయోగాలు చేసి, డాక్యుమెంటరీని రూపొందించింది. చివరకు అసలు కారణాన్ని కనిపెట్టింది. అది ఏంటంటే.. దాదాపు 100 అడుగుల వరకు ఎగిసే ‘రాకాసి అలలే’ ఇన్ని ఘోరాలకు కారణమని తేల్చింది. వీటికి ‘రోగ్ వేవ్స్’ అని పేరుపెట్టింది. రోగ్ వేవ్స్... ‘రోగ్ వేవ్స్’ పేరుకు తగ్గట్టుగానే ఇవి రోగ్ పనులే చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మాములుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒకదానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి కారణం.. సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లట. దాంతో అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయ రూపం ధరిస్తుందట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహానాలను నడపడం అంత తేలిక కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం మారడంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాని నుంచి బయటపడే లోపే అపార నష్టం జరుగుతుంది. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్లో ఇన్ని ఓడలు మునిగాయంటున్నారు శాస్త్రవేత్తలు. -
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇదేనా?
లండన్: పెద్ద పెద్ద నౌకలతోపాటు ఆ మార్గం గుండా ఆకాశమార్గాన ప్రయాణిస్తున్న విమానాలను కొన్ని క్షణాల్లోనే మింగేసి సముద్ర గర్భంలో దాచేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోని నార్వే తీరానున్న బేరెంట్స్ సముద్ర గర్భంలో కిలోమీటరు వెడల్పు, 150 అడుగుల లోతైన క్రేటర్స్ (గొయ్యిలాంటి అగ్నిబిళ ముఖద్వారాలు) అనేకం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రేటర్స్‌కు అడుగుభాగానున్న సహజవాయువుల నుంచి విపరీతంగా మిథేన్ గ్యాస్ వెలువడుతోందని, ఈ గ్యాస్‌కు పేలుడు స్వభావం ఉన్నందున అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు సంభవించి మిథేన్ గ్యాస్ మండిపోయి ఆ ప్రాంతంలో ఏర్పడిన శూన్యాన్ని నింపడం కోసం సముద్ర జలాలు ఒక్కసారిగా క్రేటర్స్లోకి చొచ్చుకుపోవడం వల్ల భారీ నౌకలు కూడా మునిగిపోతున్నాయని వారు అంచనా వేశారు. కొన్ని సందర్భాల్లో మంచుగడ్డ రూపంలో ఉన్న మిథేన్ గ్యాస్ కూడా తగులబడి పోవడం శూన్యం మరింత విస్తరిస్తున్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు. విమానాలు కూలి పోవడానికి కూడా మథేన్ గ్యాస్ మండిపోవడంతో ఏర్పడిన శూన్యమే కారణమా? అన్న అంశాన్ని ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని వారంటున్నారు. ఏదేమైనా క్రేటర్స్ను కనగొనడం ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనని వారు చెబుతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ బ్రిటన్ అంతర్జాతీయ జలాల ప్రాదేశిక ప్రాంతం నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకు విస్తరించి ఉంది. -
వామ్మో.. బెర్ముడా!
అది 1945, డిసెంబరు 5... సమయం: మధ్యాహ్నం 2.10 గంటలు.. స్థలం: ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్.. టీబీఎమ్ అవెంజర్స్ రకానికి చెందిన 5 బాంబర్ విమానాలు ‘ఫ్లైట్-19’ అనే కోడ్ నేమ్‌తో రోజువారీ శిక్షణలో భాగంగా టేకాఫ్ తీసుకున్నాయి. అవి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దాని కెప్టెన్ నుంచి ఓ సందేశం వచ్చింది. '‘మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం.. దిక్సూచీలు పనిచేయట్లేదు. మేం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు'' అని. తర్వాత రాడార్‌పై విమానాలు కనిపించలేదు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది, ఆ విమానాలు ఏమయ్యాయో నేటికీ తెలియలేదు. అయితే, వాటి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిల్‌కు ఉన్న సంబంధమేంటి? బెర్ముడా ట్రయాంగిల్ వాయవ్య అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక అంతుచిక్కని ప్రాంతం. దీన్నే 'డెవిల్ ట్రయాంగిల్’ అని కూడా పిలుస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందన్న వాదనలు, ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు గల్లంతవడం, అందులోని మనుషుల జాడ కూడా తెలవకపోవడంతో ఇది మిస్టరీ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలాయి. బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి రాగానే భారీ ఓడలు, విమానాలు అనూహ్యంగా అదృశ్యమవడం, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లభించకపోవడం వెనక అనేక కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని ప్రజలు, రచయితలు రకరకాల వాదనలు చేస్తున్నారు. వీటిపై జరిగిన పరిశోధనలు మాత్రం అలాంటివాటికి ఆధారాలేం లేవని చెబుతున్నాయి. ఎక్కడుంటుంది? ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, కరీబియన్ దీవి ఇంకా అజెరాస్ తూర్పుభాగాన ఉన్న అరేబియన్ సముద్రం వీటి మధ్య విస్తరించిన ట్రెపిజాయిడ్ను కలిపి బెర్ముడా ట్రయాంగిల్’గా వ్యవహరిస్తారు. ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా తీరం, బహామా దీవుల్లోనే జరిగినట్లు చెబుతారు. ఇది చాలా రద్దీ ప్రాంతం. తరచు అమెరికా, యూరప్, కరీబియన్ దేశాలకు చెందిన పలు ఓడలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో సముద్రం అడుగున ‘సాగర అంతర్వాహిని’(గల్ఫ్‌స్ట్రీమ్ ) ప్రవహిస్తుందని, అదే ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక్కడ హఠాత్తుగా తుపానులు చెలరేగి వెంటనే సమసిపోతుంటాయి. మెక్సికో సింధుశాఖ నుంచి ఫ్లోరిడా జలసంధి దాకా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒక అంతర్వాహిని. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది సముద్రంలో ప్రవహించే ఒక నది అన్నమాట. అడుగున ప్రవాహం ఉన్నపుడు ఉపరితలంలో ఉన్న ఓడలను లాక్కోవడం వింతేమీ కాదు. అవి మరో చోట తేలడంలో విచిత్రమేం లేదు. ఇక్కడ అకస్మాత్తుగా చెలరేగే అలలు కూడా పడవలు మునగడానికి, అదృశ్యమవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొలంబస్కూ అనుభవమే! ఈ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని క్రిస్టఫర్ కొలంబస్ రాశాడు. ఇక్కడ క్షితిజ రేఖలో ఏవో వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచీ కొలతలు సైతం అసంబద్ధంగా, అసాధారణంగా ఉన్నాయని 1492, అక్టోబరు 2న తన లాగ్‌బుక్‌లో రాశాడు. కొలంబస్ అనుమానాలకు ఆధునిక శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చూసిన వెలుగులు అక్కడ దీవి వారు వంట చేసుకుంటే వచ్చిన వెలుగులుగా చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతోందన్న విషయం తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యటించారు. వారికి అక్కడ అసాధరణంగా ఏదీ కనిపించలేదు. కానీ, కొన్ని ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ఆ ప్రాంతంలో బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. ఇవి జలాల ఉపరితలాలపై కాకుండా, అంతరపొలాల్లో ఏర్పడటం గమనార్హం. ఇవి ఒక్కోసారి 200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో ఉండటం గమనార్హం. భ్రమణంలో ఉన్న వస్తువుపై ఎలాంటి భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. కాబట్టి. ఈ సుడిగుండాల్లో చిక్కిన ఓడలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు వీటిలో చిక్కుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అన్నీ అభూత కల్పనలే: క్వొశ్చె బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించిన వెలువడుతున్న సంచలనాలపై ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ క్వొశ్చె పరిశోధన చేశాడు. 1975లో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనే పుస్తకం ప్రచురించాడు. అక్కడ జరిగే ప్రమాదాలు అసాధారణమైనవి కాదని స్పష్టంచేశాడు. అలాంటివి ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని చెప్పాడు. రచయితలు, మీడియా వ్యక్తులు అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేశారని వాదించాడు. అవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా తన పుస్తకంలో అభివర్ణించాడు. అక్కడ జరిగిన ప్రమాదాలలో కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తే..మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగాయని వివరించాడు. బెర్ముడా ట్రయాంగిల్‌తో సంబంధం లేని ఘటనలను కూడా దానితో ముడిపెట్టి రాశారని ఆరోపించాడు. అంతేకాకుండా వాటికి బెర్ముడా ట్రయాంగిల్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో పేర్కొన్నాడు. -సాక్షి, స్కూల్‌ఎడిషన్


