
బాలాసోర్: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే నూతన ‘ప్రళయ్’ క్షిపణి టెస్ట్–ఫైర్ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో సోమవారం, మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలియజేసింది. ప్రళయ్ అనేది షార్ట్‌రేంజ్ మిస్సైల్. దాదాపు వెయ్యి కిలోల సంప్రదాయ పేలోడ్లను 500 కిలోమీటర్ల దాకా మోసుకెళ్లగలదు. రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ(డీఆర్‌డీఓ) ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.
అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రళయ్‌తో మన సైనిక దళాల సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవచ్చని స్పష్టంచేశారు. టెస్ట్–ఫైర్‌లో భాగంగా ప్రళయ్ మిస్సైల్ కనిష్ట, గరిష్ట రేంజ్ సామర్థ్యాన్ని పరీక్షించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. వరుసగా రెండు ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించామని, అత్యంత కచి్చతత్వంతో లక్ష్యాన్ని మిస్సైల్ ఛేదించిందని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో వివరించింది. ప్రళయ్‌ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం విశేషం.