
‘శాంతిని వాంఛించే వారు సమరానికి సర్వసన్నద్ధంగా ఉండాల’ని నాలుగో శతాబ్దంనాటి రోమన్ రచయిత వెజిటియస్ అంటాడు. రక్షణ అమ్ములపొదిలో పదునైన, శక్తిమంతమైన ఆయుధాలుంటే, అవసరం పడినప్పుడు వినియోగిస్తే శత్రువు ‘పాహిమాం’ అనక తప్పదని పాకిస్తాన్‌తో ఈమధ్య జరిగిన ఘర్షణలు కూడా నిరూపించాయి. ఈ నేపథ్యంలో మన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల మధ్యశ్రేణి అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా బుధవారం ప్రయోగించారు.
అత్యాధునిక సాంకేతి కతల్ని జోడించటం, రైలు పట్టాల సదుపాయం ఉన్న ఎలాంటి మారుమూల ప్రాంతాల కైనా సులభంగా తీసుకువెళ్లగల వెసులుబాటు ఈ క్షిపణి ప్రత్యేకత. మన రక్షణ సన్నద్ధతపై చాన్నాళ్లుగా రక్షణరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. యూపీఏహయాంలో అయితే కుదిరిన ప్రతి రక్షణ ఒప్పందంపైనా, కొనుగోళ్లపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి రక్షణ దళాల చీఫ్ జనరల్ వీకే సింగ్ నేరుగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ కూడా రాశారు.
అప్పట్లో రక్షణరంగ పరిశోధనలూ, ఆవిష్క రణలూ లేకపోలేదు. ఆత్మనిర్భర్ భారత్ భావన తర్వాత ఇవి మరింత వేగంగా విస్తరించాయి. ఇప్పటికీ రక్షణ కొనుగోళ్లు తప్పడం లేదు. మన రక్షణ బడ్జెట్‌లో 36 శాతం విదేశీ కొనుగోళ్లకు వెచ్చిస్తున్నాం. కానీ అగ్ని ప్రైమ్ వంటి మెరికల్లాంటి ఆయుధాలు మన సత్తా చాటుతున్నాయి. మున్ముందు వేరే దేశాలపై మనం ఆధారపడే అవసరం ఉండబోదన్న భరోసానిస్తున్నాయి.
యుద్ధాల తీరుతెన్నులు ఊహకందనివిధంగా మారాయి. ఒకప్పుడు భారీ ఆయు ధాలూ, పెనువేగంతో దూసుకెళ్లి శత్రువును దెబ్బతీయగలిగే యుద్ధ విమానాలూ ప్రధాన పాత్ర పోషించేవి. ఇప్పుడది మారింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్‌కు ఆయుధాలు అనుసంధానించి, కృత్రిమ మేధ(ఏఐ) జోడిస్తే చడీచప్పుడూ లేకుండా శత్రు దేశంలో కీలక స్థావరాలను సునాయాసంగా ధ్వంసం చేయటాన్ని, భారీ నష్టం కలిగించ టాన్నీ ఉక్రెయిన్ యుద్ధంలో గమనించవచ్చు.
ఏఐను జోడించటం వల్ల అవి పరస్పరం సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరగానే తమను మోసుకెళ్లిన విమానం నుంచి వాటంతటవే విడివడి మిడతల దండులా శత్రులక్ష్యంపై దాడి చేయటం అసాధారణం. ఈ రంగంలో డీఆర్‌డీవో వంటి సంస్థలు ఇప్పటికే ఎంతో ముందుకెళ్లాయి. రోబోటిక్స్, సైబర్ వార్‌ఫేర్ తదితర రంగాల్లో సైతం ప్రగతి సాధించాయి. 2022 నాటికే మన దేశం ఏఐ ఉత్పత్తులు, సాంకేతికతలకు సంబంధించి 75 కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చింది.
శత్రుదేశం నుంచి వచ్చిపడే డ్రోన్‌లూ లేదా విమానాలను మధ్యలోనే అడ్డగించే సాంకే తికత, ఏం జరుగుతున్నదో అంచనాకొచ్చి తగిన విధంగా స్పందించే వ్యవస్థలూ రక్షణా వసరాల్లో వినియోగంలోకొచ్చాయి. మానవరహిత యూఏవీలు గూఢచర్యం, దాడి చేయటం, అవసరమైన సామగ్రి మోసుకెళ్లడం వగైరాలు చేస్తున్నాయి. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్టీఆర్వో) ఎలక్ట్రానిక్స్ రంగంలో శత్రుదేశం కమ్యూనికేషన్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయగల సీ4ఐఎస్‌ఆర్ వంటి అత్యాధునిక సెన్సర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
వాటిని ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలకూ, తేజస్ విమానా లకూ అనుసంధానించటం వల్లనే మన సైన్యానిది పైచేయి అయింది. 2022–23తో పోలిస్తే 2023–24లో మన రక్షణ ఉత్పత్తుల విలువ రూ. 1.27 లక్షల కోట్లకు చేరింది. ఈ క్రమంలో అగ్ని ప్రైమ్ క్షిపణి కీలక మలుపు. యుద్ధ సమయాల్లో క్షిపణుల వికేంద్రీకరణకు అగ్ని ప్రైమ్ అక్కరకొస్తుంది. అయితే మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తేనే దీనికి సార్థకత.
రైల్వే ట్రాక్‌లో 70,000 కిలోమీటర్లతో ప్రపంచంలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం. దీన్నింకా విస్తరించాలి. చివరి నిమిషం వరకూ శత్రువు కంటబడకుండా ఈ క్షిపణుల కోసం సొరంగాలు అవసర పడతాయి. నిధుల లేమిని ఎదుర్కొంటున్న డీఆర్‌డీవో, ఇస్రో, ఎన్టీఆర్‌వో వగైరాలకు కేటాయింపులు పెంచితే మరిన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి. మన రక్షణ రంగం మరింత బలోపేతమవుతుంది.