న్యూఢిల్లీ: సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.79,000 కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాలు, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది.
తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, పినాకా రాకెట్ వ్యవస్థ కోసం లాంగ్–రేంజ్ గైడెడ్ రాకెట్ మందుగుండు సామగ్రి, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్ సిçస్టమ్, ఆర్మీ ఫిరంగి రెజిమెంట్ల కోసం లోయిటర్ మునిషన్ వ్యవస్థల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడికి లోయిటర్ మునిషన్ ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో, తక్కువ ఎగిరే మానవరహిత వైమానిక వ్యవస్థలను తక్కువ స్థాయి తేలికైన రాడార్లు గుర్తించి, ట్రాక్ చేస్తాయి.
సుదీర్ఘ లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పినాకా రాకెట్, వ్యవస్థల పరిధి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లను కొనుగోలు చేయనున్నారు. వ్యూహాత్మక యుద్ధ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో భారత సైన్య కీలకమైన ఆస్తులను ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ రక్షిస్తుంది.
ఇక హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిరంతర నిఘా కోసం పెద్ద సంఖ్యలో రిమోట్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్‌పీఏఎస్)లను లీజుకు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆటోమేటిక్ టేకాఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్ ఏరోస్పేస్ వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని, ఆస్ట్రా ఎమ్– ఐఐ క్షిపణులు ప్రత్యర్థి విమానాలను తటస్థీకరించే యుద్ధవిమానాల సామర్థ్యాన్ని పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.


