ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తరకొరియా జపాన్ భూభాగంలో బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా జపాన్ అప్రమత్తమైంది. అత్యవసరంగా సమవేశమై హెచ్చరికలు జారీ చేసింది.
జపాన్ మీడియా కథనాల ప్రకారం.. జపాన్ సముద్ర తీరం నుండి 200 మైళ్ల దూరం వరకూ ఆ దేశానికి చెందిన జలాలుగానే పరిగణిస్తారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆ క్షిపణులు దాదాపు 950 కిలోమీటర్ల పాటు ప్రయాణించాయని తెలిపాయి. అమెరికా, జపాన్ దేశాలకు సంబంధించిన కీలకమైన రక్షణ స్థావరాలతో పాటు దక్షిణ జపాన్‌లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని ఆయన తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ హెచ్చరిక జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.
అయితే నార్త్ కొరియా ఇదివరకే జపాన్ మీదుగా తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయంలో ఇది వరకే జపాన్ ఎన్నో సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు జపాన్‌లో ఉన్నాయి. యుఎస్,నార్త్‌కొరియాకు అస్సలు పొసగదు. దీంతో జపాన్‌తో కూడా ఆ దేశం దూరంగా ఉంటుంది.
అయితే వెనిజులాపై అమెరికా దాడిని నార్త్ కొరియా తీవ్రంగా ఖండించింది. ఈదాడి అమెరికా క్రూర స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసిందని అక్కడి ప్రభుత్వవర్గాలు వ్యాఖ్యానించాయి.


