
డ్రోన్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యం
కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌లో డీఆర్‌డీఓ ప్రయోగం
గతంలో అభివృద్ధిచేసిన యూఎల్‌పీజీఎం–వీ2 అధునాతన వెర్షన్ ఇది
యుద్ధతంత్రంలో భారత డ్రోన్ ముందంజ
అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన
దేశ రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిస్తూ డీఆర్‌డీఓ చేపట్టిన యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (యూఎల్‌పీజీఎం–వీ3) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్‌ఓఏఆర్)లో డీఆర్‌డీఓ మానవ రహిత డ్రోన్ వైమానిక వాహనం ద్వారా శుక్రవారం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టింది. గతంలో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన యూఎల్‌పీజీఎం–వీ2 అధునాతన వెర్షన్ ఇది.
యూఎల్‌పీజీఎం–వీ3 అనేక రకాల లక్ష్యాలను ఛేదించగలిగిన హై డెíఫినిషన్ డ్యూయల్ చానల్ సీకర్‌తో అమర్చబడి ఉంటుంది. దీనిద్వారా మైదానం, అధిక ఎత్తు ప్రాంతాల నుంచి ప్రయోగించొచ్చు. ఇది పగలు, రాత్రి పనిచేసే సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది. లక్ష్యం, లక్ష్య పాయింట్ నవీకరణకు రెండు మార్గాల డేటా లింక్‌ను కలిగి ఉంటుంది. - సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు (సెంట్రల్)/ఓర్వకల్
క్షిపణుల ప్రయోగాలకుకేంద్రంగా ఎన్‌ఓఏఆర్..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఉన్న డీఆర్‌డీఓకు చెందిన నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్‌ఓఏఆర్) క్షిపణుల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. గతంలో కూడా డీఆర్‌డీఓ యూఎల్‌పీజీఎం–వీ2 క్షిపణి పరీక్ష కోసం ఎన్‌ఓఏఆర్ వేదికనే వినియోగించింది. ప్రస్తుతం ప్రయోగించిన యూఎల్‌పీజీఎం–వీ3 క్షిపణి ప్రయోగానికి కూడా అదే వేదికైంది. ఈ ఆయుధం మానవ రహిత విమానాలను కూల్చేందుకు వినియోగిస్తారు.
ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత డ్రోన్ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రేంజ్. దీనిని 2016–17లో ప్రారంభించారు. సాధారణంగా.. ఇండోర్‌లో పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధాలు అందుబాటులోకి రావాలంటే ఏడాది నుంచి రెండేళ్లు సమయం పడుతుంది. కానీ, బాహ్య ప్రదేశాల్లో పరిరక్షించేవి వేగంగా దళాల్లోకి చేరే అవకాశం ఉంటుంది.
అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన కోసం..
ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడార్లు, ట్రాన్స్‌మీటర్లు, యాంటెనాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలతోపాటు డైరెక్ట్ ఎనరీ (లేర్) వెపన్స్ కూడా ఉంటున్నాయి. యూఎల్‌పీజీఎం శ్రేణి ఆయుధాలను తపస్ బీహెచ్, అర్చర్ ఎన్‌ఈ యూఏపీల కోసం అభివృద్ధి చేశారు. వీటిని చాలా తక్కువ ధరతో ఉత్పత్తి అవుతాయి. ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్‌గెట్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి.
రక్షణ మంత్రి అభినందనలు..
యూఏవీ లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతం కావడంతో రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డీఆర్‌డీఓను అభినందించారు. కీలక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను భారత్ అందిపుచ్చుకుని ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం ఎంఎస్‌ఏఈ, స్టార్టప్‌లను కూడా ఆయన అభినందించారు.