
జైసల్మేర్: డీఆర్డీఓ శాస్త్రవేత్తల, భారత ఆర్మీ అధికారుల రహస్య వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఓ ఉద్యోగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో మహేంద్ర ప్రసాద్‌ను రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.
మహేంద్ర ప్రసాద్ భారతదేశానికి సంబంధించిన రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం అతనిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తరువాత తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తీసుకువెళ్లనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలోని భద్రతను చురుకుగా పర్యవేక్షిస్తోందని రాజస్థాన్, జైపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి (సెక్యూరిటీ), డాక్టర్ విష్ణుకాంత్ మీడియాకు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్ పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తున్నట్లు సీఐడీ నిఘా సమయంలో వెల్లడయ్యింది. క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలిక గురించి అతను పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.
జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థలు నిందితుడిని సంయుక్తంగా విచారించాయి. మహేంద్ర ప్రసాద్ మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించగా, అతను డీఆర్‌డీఓతో పాటు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిర్వాహకులతో పంచుకుంటున్నాడని స్పష్టమయ్యింది. ఈ నేపధ్యంలో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.