హైదరాబాద్‌లో రఫేల్‌ ఫ్యూజిలేజ్‌ల తయారీ | Manufacturing of Rafale fuselages in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రఫేల్‌ ఫ్యూజిలేజ్‌ల తయారీ

Jun 6 2025 5:48 AM | Updated on Jun 6 2025 5:48 AM

Manufacturing of Rafale fuselages in Hyderabad

అత్యాధునిక యుద్ధ విమానాల కీలక భాగాల ఉత్పత్తి

డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ మధ్య ఒప్పందం

2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్‌ ఉత్పత్తికి చర్యలు

ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయనున్న టాటా సంస్థ

ఫ్రాన్స్‌కు వెలుపల తొలిసారి రఫేల్‌ ఫ్యూజిలేజ్‌ల తయారీ

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్‌లు హైదరాబాద్‌లో తయారు కానున్నాయి. ఇందుకోసం రఫేల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫ్యూజిలేజ్‌ను తయారు చేసేందుకు టాటా సంస్థ హైదరాబాద్‌లో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 

ఫ్రాన్స్‌ వెలుపల తొలిసారి రఫేల్‌ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్‌లు హైదరాబాద్‌ లోనే తయారు కానుండటం విశేషం. రెక్కలు, తోక మినహా విమానంలోని ఇతర భాగాన్ని ఫ్యూజిలేజ్‌ అంటారు. ఇందులో ప్రయాణికులు, సరుకులు, ఇతర పరికరాల రవాణా కోసం ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఒప్పందంతో భారత వైమానిక తయారీ రంగం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్‌ యూనిట్‌లో ఫ్యూజిలేజ్‌లోని ముందు, వెనుక, పక్క భాగాలు తయారవుతాయి. 

2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్‌ ఉత్పత్తి
ఒప్పందం మేరకు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రఫేల్‌ యుద్ధ విమానం తొలి ఫ్యూజిలేజ్‌ హైదరాబాద్‌ యూనిట్‌ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ప్రతి నెలా రెండు ఫ్యూజిలేజ్‌లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘రఫేల్‌ ఫ్యూజిలేజ్‌లు తొలిసారి ఫ్రాన్స్‌ బయట ఉత్పత్తి కానున్నాయి. 

భారత్‌లో మా సప్లై చైన్‌ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందాన్ని కీలకమైనదిగా భావిస్తున్నాం’అని డసాల్ట్‌ ఏవియేషన్‌ చైర్మన్, సీఈఓ ఎరిక్‌ ట్రాపియర్‌ తెలిపారు. ‘డసాల్ట్‌ ఏవియేషన్‌తో ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్‌ రంగం ప్రయాణంలో ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం ఆధునిక, దృఢమైన ఏరోస్పేస్‌ తయారీ పర్యావరణ వ్యవస్థ స్థాపనలో గొప్ప పురోగతికి ప్రతిబింబంగా నిలుస్తుంది’అని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుకరణ్‌ సింగ్‌ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement