న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక ఏర్పడింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే వందమందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేశారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ముందు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేడు (మంగళవారం) స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఫిబ్రవరి 4న సభా మర్యాదలను కాపాడేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ, గందరగోళం సృష్టించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చేలా కొందరు సభ్యులు వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష ఎంపీలు మునుపెన్నడూ లేని విధంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని బీజేపీ ఎంపీలు తమ లేఖలో వివరించారు. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా, స్పీకర్ టేబుల్‌పైకి ఎక్కి కాగితాలు చింపి, విసిరారని ఆరోపించారు. మరికొందరు మహిళా ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ప్లకార్డులు పట్టుకుని ట్రెజరీ బెంచీల వైపు వెళ్లారని, ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే సీటును కూడా చుట్టుముట్టారని వారు పేర్కొన్నారు. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
బీజేపీ లేఖకు ఒకరోజు ముందే కాంగ్రెస్ మహిళా ఎంపీలు కూడా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని మోదీ సభకు గైర్హాజరు కావడాన్ని సమర్థించుకునేందుకు పాలకపక్షం ఒత్తిడికి లొంగి, స్పీకర్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమపై బురద చల్లడం ద్వారా వారిలోని లోపాలను కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిమణి సహా పలువురు నేతలు సంతకం చేసిన ఈ లేఖలో.. తమపై చేస్తున్న ఆరోపణలను వారు పూర్తిగా తోసిపుచ్చారు. తాము రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్నవారమని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.


