అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.
హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్‌మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.
మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది.
పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్
ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.
జామా ఆందోళన
ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్‌లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.
గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు.


