ఇరాన్ సంక్షోభం నేపథ్యంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి.. అమెరికా సైనిక దాడులు జరపడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ముగిసిన ఈ భేటీలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ప్రముఖ జర్నలిస్ట్, ఇరాన్ మహిళా ఉద్యమకారిణి మసీహ్ అలినెజాద్.. యూఎన్ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి భేటీలో పాల్గొన్న ఆమె.. ఇరాన్ యూఎన్ రాయబారి ఘోలంహోసేన్ డర్జీని టార్గెట్ చేసుకున్నారు. ‘‘మీరు(ఇరాన్) నన్ను మూడుసార్లు చంపాలని చూశారు. నా ఇంటి వద్దకు మనుషుల్ని పంపించారు. వాళ్లను నేను చూశాను కూడా’’ అని వ్యాఖ్యానించారామె.

ఖమేనీ ప్రభుత్వం ఐసిస్‌లా ప్రవర్తిస్తోందన్న మసీహ్.. ఇరాన్‌లో అణచివేతలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. అంతర్జాతీయ ఖండనలు ఏమాత్రం సరిపోవని, ప్రపంచ దేశాలు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఇరాన్ ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఉద్ఘాటించారు. ఐరాన్‌లో జరుగుతున్న నిరసనలు గొప్ప ఉద్దేశంతో కూడుకున్నవని.. ఐరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని.. మా దేశం, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్లతో ఉన్నారు అని స్పష్టం చేశారు. నిరసనలు విదేశీ కుట్ర కాదని.. ఐరాన్ ప్రభుత్వం తన ప్రజలకే భయపడుతోందని వాల్ట్జ్ అన్నారు.
యూఎన్ అధికారులు ఇరాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై సైనిక దాడులు జరిగితే ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరం చేస్తాయని హెచ్చరించారు.
ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ తరఫున మార్థా పోబీ మాట్లాడుతూ.. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించాలి అని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.


