ఇరాన్‌పై సైనిక దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌తో పాటు కొన్ని అరబ్ దేశాలు కోరినట్లు ఎన్‌బిసి న్యూస్ నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఇంకా అమెరికా దాడితో కూలిపోయేంత బలహీనంగా లేదని ఈ దేశాల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇరాన్‌లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా నిరసనకారుల హత్యలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన క్రమంలో ఈ నివేదిక వెలువడింది.
నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్‌లో పాలన మార్పునకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేవలం విదేశీ సైనిక దాడితో ఆ లక్ష్యం సాధ్యం కాదని అమెరికా అధికారులకు స్పష్టం చేశారు. అలాంటి దాడి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా పరిస్థితిని మరింత సంక్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
సైనిక చర్యలకు బదులుగా, ఇరాన్ ప్రభుత్వాన్ని లోపలినుంచి బలహీనపరిచే వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇందులో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను ఎదుర్కొనేందుకు ఇరానియన్ ప్రజలకు సహాయం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, సైబర్ దాడులు నిర్వహించడం, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఉన్నతాధికారులపై పరిమిత చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా నేతృత్వంలో దాడి చేపట్టేందుకు పొరుగు దేశాల మద్దతు లేదని ఒక అరబ్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకార చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకమయ్యే ప్రమాదం కూడా ఉందని మరో అరబ్ అధికారి హెచ్చరించారు.


