శ్రీ గౌరిప్రియ, నాగచైతన్య, కిరణ్ అబ్బవరం, రవి నంబూరి
‘‘నాకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్‌స్టోరీ సినిమాలు తగ్గిపోతుంటే బాధపడ్డాను. లవ్‌స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్తారా? వెళ్లరా? అని భయపడ్డాను. మెల్లిగా ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ ‘చెన్నై లవ్‌స్టోరీ’తో మరో కల్ట్ లవ్‌స్టోరీ సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో నేను కోరుకునే ప్రేమకథను చూశాను. పరిణతితో రాసిన ప్రేమకథ ఇది’’ అని నాగచైతన్య అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. సాయి రాజేష్ కథ అందించగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది.
రిలీజైన 3 రోజుల్లోనే రూ. 40.1 కోట్లు వసూళ్లను రాబట్టిందని చిత్రయూనిట్ పేర్కొంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన హీరో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కష్టాలు, అడ్డంకులన్నీ దాటుకుని తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కిరణ్. నివిలాంటి క్యారెక్టర్‌ను గౌరి యాక్సెప్ట్ చేసి, తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించడం సులువైన పని కాదు. ఇంతమంచి కథ రాసి, మరో దర్శకుడికి ఇవ్వడంలోనే సాయి రాజేష్ గొప్పతనం కనిపిస్తోంది. కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మెచ్యూర్డ్ లవ్‌స్టోరీని రవి నంబూరి చక్కగా తెరకెక్కించాడు.
ఈ సినిమా టీమ్ అంతా గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చారు. వీళ్ల విజయం నాకెంతో స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్త వాళ్లకు కూడా వీళ్ల విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఒక పోస్టర్ మీద కలెక్షన్స్ నంబర్స్ వేయడం కంటే ఇదే నిజమైన సక్సెస్. ఒక ప్రేమ కథకు ఇలాంటి నంబర్స్ బాక్సాఫీస్ వద్ద రావడం చాలా అద్భుతం’’ అని అన్నారు. నాలుగు రోజుల్లోనే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్లో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం, ఎస్‌కేఎన్, సాయి రాజేష్, రవి నంబూరి ధన్యవాదాలు తెలిపారు.


