‘‘చెన్నై లవ్ స్టోరీ’కి నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా తీశారు రవి నంబూరి. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. ‘బేబి’ తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమా చేయాలనుకున్నాం. ‘బేబి’ కన్నా ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా గొప్ప సినిమా’’ అని సాయి రాజేష్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
శనివారం జరిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో రవి నంబూరి మాట్లాడుతూ– ‘‘మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా ఓ కల. ఆ కల నిజం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ– ‘‘కొంచెం ఎమోషనల్‌గా ఉన్నాను. నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది. మా అమ్మ ఉండి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవారు. కానీ, మా అమ్మ రూపంలో విశాల, ప్రమోదినిగార్లు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెబుతుంటారు. ఇక్కడికి రాగానే ‘చెన్నై లవ్ స్టోరీ’లో నువ్వు చేసిన నివి పాత్రకు నీకు మంచి పేరు, ప్రశంసలు వస్తున్నాయి... అమ్మ చూసుంటే చాలా బాగుండేది’’ అని వారు అన్నారు. కానీ, మా అమ్మ చూస్తోంది.. తన వల్లే నాకీ పేరు వస్తోందని నా ఫీలింగ్’’ అన్నారు.
‘‘అప్పట్లో బాలచందర్, భారతీరాజాగారి కథల్లా సాయి రాజేష్‌గారి కథల్లో లోతు ఉంటుంది. మా సినిమా తొలి రోజు రూ. 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ఎస్‌కేఎన్ పేర్కొన్నారు. ‘‘నా కెరీర్‌లో స్టీవెన్ శంకర్ అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన రవి నంబూరిగారికి థ్యాంక్స్’’ అన్నారు కిరణ్ అబ్బవరం. కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, రచయిత అనంత శ్రీరామ్, నటీనటులు ప్రమోదిని, త్రిగుణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


