ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు రష్మిక మందన్నా. మరోవైపు ఇటు సినిమాలు అటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్ నిడిమోరు (రాజ్), కృష్ణ దాసరి (డీకే). వీరిద్దరూ తాజాగా రష్మిక కోసం ఓ పవర్‌ఫుల్ కథని సిద్ధం చేస్తున్నారట. కాగా ఇటీవలే రాజ్ నిడిమోరు అందించిన కథతో సమంత లీడ్ రోల్‌లో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
అందం, అభినయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ అభిమానులను సం పాదించుకున్న రష్మికతో ఇప్పుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట రాజ్ అండ్ డీకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు ఆరంభంలో ఉన్నాయని సమాచారం. రష్మిక ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఆమెను కలిసి వినిపించనున్నారట రాజ్–డీకే. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ కొత్త కాంబినేషన్ కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే.


