చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే డ్రగ్స్ పార్టీలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీని కలవరం పెడుతున్నాయి. నైట్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన సంఘటనలు ఎన్నో మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే ఈ పాడు కల్చర్ కేవలం వెండితెరకు మాత్రమే కాదు బుల్లితెరపై కూడా ఉంది అంటుంది ప్రముఖ నటి నారాయణి శాస్త్రి.‘క్యుంకి సాస్ భీ కభీ బహు థీ', 'సంజీవని', 'కోయి అప్నా సా', 'కుసుమ్', 'పియా కా ఘర్', 'నయన్‌తార' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందిన ఈ బుల్లితెర నటి..తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
పార్టీలో డ్రగ్స్ బడ్జెట్..
‘ఒకప్పుడు పార్టీలలో మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు కొన్ని పార్టీల్లో ఏకంగా అక్రమ మాదక ద్రవ్యాల(డ్రగ్స్) కోసం బడ్జెట్‌లు కేటాయిస్తున్నారు. ఇది చూసి నేను షాకయ్యా. అందుకే చాలా ఏళ్ల క్రితమే నేను పార్టీలకు వెళ్లడం మానేశాను. ఇప్పటి పార్టీలు డాన్స్, సరదాల గురించి కాకుండా పూర్తిగా వేరే వైపు దారితీశాయి.
పెద్ద ఈవెంట్లలో డ్రగ్స్ ఉండాల్సిందే..
చిన్నచిన్న సమావేశాల్లో డ్రగ్స్ వాడకంపై బహిరంగ చర్చలు జరుగుతాయని, అయితే పెద్ద ఈవెంట్లలో దీనిని చాలా రహస్యంగా నిర్వహిస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక డ్రగ్స్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలుసు. డ్రగ్స్ వాడేవారితో నాకు వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా, వారు కోకైన్, ఎండీఎంఏ(MDMA) వంటి పదార్థాలు వినియోగించడాన్ని నేను స్వయంగా చూశాను. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొందరు నటులు కనీసం నిలబడలేని స్థితికి చేరుకుంటారు’ అని నారాయణి శాస్త్రి చెప్పుకొచ్చారు.
ఇక తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతూ.., ఎవరైనా డ్రింక్స్‌లో ఏదైనా కలిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గతంలో ఒకసారి ఆల్కహాల్‌ను రుచి చూశానని చెప్పారు. అంతేకాకుండా కేవలం ప్రయోగాత్మకంగా, కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి గతంలో కొన్నిసార్లు డ్రగ్స్ పరీక్షించి చూశానని, అయితే వాటికి ఎప్పుడూ బానిస కాలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


