తెలుగు సినీ పరిశ్రమకు ఆయన నవరస నటనా సార్వభౌముడు. వెండితెరపై వందల పాత్రల్లో జీవించి కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన మహానటుడు. కానీ కృష్ణా జిల్లా కౌతవరం ప్రజలకు మాత్రం ఆయన ఇప్పటికీ ‘మన కైకాల’. శనివారం ఆయన జయంతి సందర్భంగా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్న ఆ ముద్దుబిడ్డ జ్ఞాపకాలివి.
కృష్ణాజిల్లా: తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పోషించిన పాత్రలు కాదు.. ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన ప్రాణం. యముడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, రాజుగానైనా, రైతుగానైనా.. తెరపై కనిపించిన ప్రతిసారి ఆ పాత్రే నిజమైపోయేది. అలాంటి మహానటుడి మూలాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం అనే చిన్న గ్రామంలోనే ఉన్నాయి. కైకాల జయంతి సందర్భంగా ఆయన సినీ విజయాల కంటే, ఆయనను తీర్చిదిద్దిన కౌతవరం జ్ఞాపకాలు నేటికీ గ్రామంలో సజీవంగా నిలిచాయి.
కాలినడకన చదువుకున్న బాలుడు.. కోట్లాది అభిమానుల నటుడయ్యాడు
ప్రాథమిక విద్య కౌతవరంలో పూర్తిచేసిన కైకాల, హైస్కూల్ చదువుకోసం ప్రతిరోజూ కాలినడకన గుడ్లవల్లేరు వెళ్లేవారు. అదే పట్టుదల ఆయనను తర్వాత మద్రాసు వరకు తీసుకెళ్లింది. అక్కడ ప్రారంభమైన సినీ ప్రయాణం దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం
విఠలాచార్య పరిచయం చేసిన ప్రతినాయక పాత్రలు కైకాలకు కొత్త గుర్తింపునిచ్చాయి. ఆయన విలన్‌గానే కాదు.. హాస్యం, కుటుంబ కథలు, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మక చిత్రాలు.. ఏ పాత్రలోనైనా సహజత్వాన్ని చూపించి ‘నవరస నటనా సార్వభౌముడు’ బిరుదును సార్థకం చేశారు.
ఎన్టీఆర్‌కు డూప్‌గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు
ఎన్టీఆర్ ను పోలిన రూపురేఖల కారణంగా పలు చిత్రాల్లో ఆయనకు డూప్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మెట్టుగా చేసుకుని తర్వాత తనదైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.
సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కౌతవరాన్ని మరచిపోలేదు. మచిలీపట్నం ఎంపీగా గ్రామంలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారు. కొత్త ఆస్పత్రి నిర్మాణం, కౌతవరం–చేవెండ్ర రహదారి అభివృద్ధి వంటి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామస్తుల మన్ననలు పొందారు. ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా లిచారు. ప్రతిఒక్కరూ ఆయన్ను గుర్తు చేసుకుంటారు.
మర్రిచెట్టు నీడలో..
1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ చిన్ననాటి రోజులు సాధారణ గ్రామీణ బాలుడివే. కౌతవరం చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు కింద గంటల తరబడి స్నేహితులతో కబుర్లు చెప్పడం, చెరువులో దొరికే చేపలు ఇష్టంగా తినడం, మంచి బెల్లం–పప్పుచెక్క కోసం మిత్రులతో తిరగడం... ఇవన్నీ ఆయన బాల్యాన్ని గుర్తుచేసే మధురస్మృతులని గ్రామ పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు.
గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం
కైకాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు.


