ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రతివారం కామెడీ చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర చేసిన ఓ మూవీ.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
అనుపమ పరమేశ్వరన్, నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దమూరి ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'క్రేజీ కళ్యాణం'. పెళ్లి అనే పాయింట్ చుట్టూ జరిగే కామెడీతో దీన్ని తెరకెక్కించారు. భద్రప్ప గాజుల దర్శకుడు. గత నెల 16న థియేటర్లలోకి వచ్చింది గానీ రణబాలి, జైలర్ 2 రిలీజ్ కావడంతో దీన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిది ఈ శుక్రవారం(నవంబర్ 20)నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలానే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చే అవకాశముంది.
'క్రేజీ కళ్యాణం' విషయానికొస్తే.. పర్వతాలు (నరేశ్ వీకే)కి ఇద్దరు కూతుళ్లు. అన్న చూసిన సంబంధం అని పెద్దకూతుర్ని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ అతను తాగుడుకు బానిసై ఊరంతటా అప్పులు చేస్తూ ఇంటిపైకి గొడవలు తెస్తుంటాడు. దీంతో పర్వతాలు.. తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి ఎలాగైనా సరే మంచి గుణగణాలు, ఆస్తిపాస్తులున్న అబ్బాయిని చూసి వివాహం చేయాలనుకుంటాడు.
కానీ కీర్తి ఆలోచనలు వేరు. స్వతంత్ర భావాలున్న ఆమె.. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, ప్రేమించిన ఉదయ్(అఖిల్)ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. ఇదే విషయాన్ని ఆమె పర్వతాలుతో చెప్పగా నో చెబుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తెచ్చిన యూఎస్ సంబంధాన్ని చేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ సినిమా)


