ప్రముఖ నటుడు–దర్శకుడు–నిర్మాత గిరిబాబు (83) మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం గిరిబాబు సొంతూరు ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకున్నాడు గిరిబాబు. అందరితోనే స్నేహపూర్వకంగానే ఉంటూ ‘అజాతశత్రువు’ అనే పేరు సంపాదించుకున్నాడు. సమస్యలు వచ్చినా.. కలిసి మాట్లాడి పరిష్కరించుకునేవాడట. అలా ఓ సారి దివంగత నటుడు ఎన్టీఆర్ తనపై కోపం పెంచుకున్నాడనే విషయం తెలిసి..నేరుగా ఆయన ఇంటికే వెళ్లి వివరణ ఇచ్చి, ఆయన కోపాన్ని తగ్గించేశాడట. ఇదంతా 1978లో జరిగింది. అప్పుడు ఎన్.టి.రామారావు ‘సింహబలుడు’ షూటింగ్ ప్రారంభించాడు.
అదే సమయంలో గిరిబాబు నిర్మాతగా కృష్ణ హీరోగా సింహగర్జన సినిమా ప్రారంభించారు దేవతాలారా దీవించండి సినిమాకి దర్శకత్వం వహించిన కొమ్మినేని శేషగిరిరావే ఈ సినిమాకి కూడా దర్శకుడు. అప్పటికే ఎన్.టి.ఆర్, కృష్ణల మధ్య గ్యాప్ ఉంది. ‘అల్లూరి సీతారామరాజు’ కథను కృష్ణ తీయడం వల్ల వచ్చిన ఆ గ్యాప్ ‘కురుక్షేత్రం’తో మరింత పెరిగింది. అలాంటి సమయంలో గిరిబాబు తను, కృష్ణ హీరోలుగా ‘సింహగర్జన’ మొదలెట్టడం ఎన్టీఆర్‌కు కోపం తెప్పించిందట. అంతేకాదు రెండు సినిమాల కథలు కూడా ఒకటే అనే ప్రచారం కూడా జరిగిందట.
దీంతో ఎన్టీఆర్ గిరిబాబుపై ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయట. ఈ విషయం తెలియగానే తానే స్వయంగా ఓ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి సింహగర్జన సినిమా కథ చెప్పానని, ఈ రెండు కథలూ వేరని ఎన్టీఆర్ సంతృప్తి చెంది తనను ప్రోత్సహించారని గిరిబాబు ఓ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. 1978 ఆగస్టులో మొదట ‘సింహబలుడు’ రెండు వారాలకు ‘సింహగర్జన’ రిలీజ్ అయ్యాయి. ‘సింహగర్జన’ సూపర్ హిట్ అయ్యింది.


