వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టే ప్రక్రియ
అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌నదీమ్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) గడువు ముగిసిన వాహనాలపై ఆటోమేటిక్ చలాన్ల విధానం అమలుకు వాహనాల నంబర్ ప్లేట్లను స్వయంచాలకంగా గుర్తించే (ఏఎన్‌పీఆర్) కెమెరాలు ఏర్పాటు చేయనుంది. పీయూసీ వ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు రాష్ట్రంలోని 516 పీయూసీ కేంద్రాలను కేంద్ర సర్వర్‌తో అనుసంధానం చేశారు. ఇప్పటివరకు 36,14,208 పరీక్షలు నిర్వహించినట్టు రవాణా శాఖ వెల్లడించింది. వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ, పీయూసీ వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ప్రజారవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచే చర్యలు కొనసాగుతున్నాయి. టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 310 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. పీఎం ఈ–డ్రైవ్ కింద రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు స్టేట్ యాక్షన్ ప్లాన్‌ను మరింత శాస్త్రీయంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్‌తో కలిసి ఉద్గారాల సమగ్ర లెక్కింపు (ఎమిషన్ ఇన్వెంటరీ)పై చర్యలు చేపడుతోంది.
బుధవారం సచివాలయంలో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌నదీమ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ (ఎక్యూఎంసీ) ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ జి.రవి, సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్, ఎన్‌సీఏపీ నోడల్ ఆఫీసర్ డా.ప్రసాద్, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కమిషనర్లు, నల్లగొండ కలెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్లగొండలోని 16వ వార్డు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించడంపై అహ్మద్ నదీమ్, రవి హర్షం వ్యక్తం చేశారు.
క్యూర్‌లో 13 సీఏఏక్యూఎంఎస్‌ల ఏర్పాటు
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)లో వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు 13 ‘నిరంతర పరిసర వాయునాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ (సీఏఏక్యూఎంఎస్) ఏర్పాటు చేయనున్నారు. సీఏఏక్యూఎంఎస్‌ల నుంచి లభించే డేటాను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి ‘ఎయిర్ క్వాలిటీ డ్యాష్ బోర్డు’ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత శాఖలకు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ల ద్వారా వాయు నాణ్యతకు సంబంధించిన సమాచారం చేరవేస్తారు. తక్కువ వ్యయంతో వాయు నాణ్యతను పర్యవేక్షించే ‘లో కాస్ట్ సెన్సార్ల (ఎస్‌సీఎస్) వినియోగించనున్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో బొల్లారం, జీడిమెట్ల ప్రాంతాల్లో ఇప్పటికే 8 ఎస్‌సీఎస్‌లను ఏర్పాటు చేశారు.
పీఎం 10 స్థాయిలపై నిరంతర పర్యవేక్షణ
2019–20 నుంచి 2025–26 వరకు నమోదైన వార్షిక సగటు పీఎం (పార్టిక్యూలెట్ మ్యాటర్)10 స్థాయిలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 86 నుంచి 80 జీ/ఎంకు, సంగారెడ్డిలో 87 నుంచి 78 జీ/ఎంకు, తగ్గుదల నమోదైంది. నల్లగొండలో 59 నుంచి 71 జీ/ఎం³గా నమోదైంది. 2025–26లో హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డిలో పీఎం10 సగటు స్థాయిలు వరుసగా 80, 71, 78 జీ/ఎంగా నమోదయ్యాయి. వాయు నాణ్యత సూచీలు ‘శాటిస్‌ఫాక్టరీ’నుంచి ‘మోడరేట్’కేటగిరీలలో ఉన్నట్టు సమీక్షలో నమోదైంది. ఐఐటీ బాంబే సమర్పించిన తుది ముసాయిదా నివేదికను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నారు.


