క్లూషియల్
బ్రేకింగ్ న్యూస్...
పత్రికల్లోను, టీవీ స్క్రీన్లపైన ఆ వార్త చూడగానే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
‘నగరంలో సంచలనం సృష్టించిన కిల్లర్స్ గ్యాంగ్ ఘాతుకం! నేరస్తుల గుండెల్లో సింహస్వప్నం అయిన ఇన్‌స్పెక్టర్ అభిమన్యు శత్రువుల దొంగచాటు కాల్పుల్లో మృతి! ఆయన మృతదేహంతో పరారైన కిల్లర్స్ గ్యాంగ్!’
ఈ వార్త తెలిసిన వెంటనే అభిమన్యు అభిమానులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. అభిమన్యు మృతితో నగరంలో తీవ్ర ఉద్రిక్తత, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. ఈ కేసు తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా హుటాహుటిన డిటెక్టివ్ సిద్ధార్థ నగరానికి చేరుకున్నాడు. స్థానిక ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
‘కిల్లర్స్ గ్యాంగ్‌ని ప్రపంచంలో ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని అంతం చేస్తాను’ అని ప్రద్యుమ్న సవాల్ చేశాడు.
పోలీసులు కిల్లర్స్ గ్యాంగ్ ఆనవాళ్ల కోసం నగరాన్ని అణువణువు జల్లెడ పట్టడం ప్రారంభించారు. అదే సమయంలో బీహార్ గ్యాంగ్, హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ తరహాలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు సృష్టించడానికి ప్లాన్ చేసింది. అభిమన్యు మరణ వార్తతో పోలీసులు తలమునకలై ఉన్న సమయంలోనే, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో మారణహోమం సృష్టించాలనేది వారి కుట్ర.
అదే సమయంలో రామ్‌పూర్‌లోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇన్ స్పెక్టర్ అభిమన్యు చనిపోలేదని, కొనప్రాణాలతో ఉన్నాడనే విషయం తెలిసింది. అభిమన్యుని అడ్డుపెట్టుకుంటే తమ ప్లాన్ విజయవంతం అవుతుందని భావించిన బీహార్ గ్యాంగ్, కిల్లర్స్ గ్యాంగ్‌పై అనుకోని దాడిచేసి, అపస్మారక స్థితిలో ఉన్న అభిమన్యుని గోల్కొండ ప్రాంతానికి తరలించింది. బాంబులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే సమయం ఆసన్నమైన తరుణంలో, డిటెక్టివ్ సిద్ధార్థ, ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నలు నిఘా ద్వారా బీహార్ గ్యాంగ్ డెన్ ను గుర్తించి మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకతో కంగారుపడిన ఉగ్రమూక, కొనప్రాణాలతో ఉన్న అభిమన్యుని బందీగా చేసుకుని, ‘ఇప్పుడే ఇతన్ని కడతేరుస్తాం’ అని హెచ్చరించింది.
డిటెక్టివ్ సిద్ధార్థ చిరునవ్వుతో, ‘ఇన్ స్పెక్టర్ అభిమన్యుని ఎవరూ చంపలేరు. సమాజంలో నేరాలు, దేశద్రోహం జరుగుతున్నంత కాలం అభిమన్యు బ్రతికే ఉంటాడు!’ అన్నాడు.
వెంటనే బీహార్ గ్యాంగ్ చీఫ్ ముక్తార్ మంచం మీద రక్తంతో ఉన్న అభిమన్యు తలకు రివాల్వర్ గురి పెట్టాడు. ‘కమాన్ షూట్’ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రద్యుమ్న.
ముక్తార్ వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.
‘ఇంకా ఆలస్యం ఎందుకు ముక్తార్?’ అంటూ అభిమన్యు కళ్ళు తెరిచాడు. కన్నుమూసి తెరిచేలోగా అభిమన్యు కుడిచేతిలో ఉన్న పిడిబాకు ముక్తార్ కుడి అరచేతిలోకి దిగింది.
∙∙
‘ముక్తార్ నీ ఆట కట్టింది. నువ్వు నగరంలో విధ్వంసం సృష్టించడానికి బీహార్ నుంచి బయల్దేరావన్న సమాచారం రాగానే, నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా జరిగే ప్రమాదాన్ని ఊహించి, నీ ఆలోచనలను డైవర్ట్ చేసి, నీ ద్వారానే ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
‘నిజానికి ఇక్కడ కిల్లర్స్ గ్యాంగ్ అంటూ వేరేగా ఏదీ లేదు. పోలీసులే ఆ గ్యాంగ్‌గా నటించారు. నగరంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలనుకునే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి అభిమన్యు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్ ప్రద్యుమ్న.
అదే సమయంలో పోలీసులు ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు. బీహార్ నుంచి హైదరాబాద్‌లోకి అడుగు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో బీహార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.
∙∙
సీఎం ఛాంబర్..
‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు! నీ ప్రాణాలను పణంగా పెట్టి, చనిపోయినట్టు నాటకమాడి రాష్ట్రంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడారు. రెండు రాష్ట్రాల ప్రజల్లో మీరంటే ఎంత అభిమానమో తెలిసింది. వాళ్ళ అభిమానాన్ని ఆపడం మా తరం కాలేదు. మీరు కనిపించాకే శాంతించారు’ మనస్పూర్తిగా అభినందించాడు ముఖ్యమంత్రి.
‘ఈ అభిమన్యు ప్రాణాలు నావి కావు, నా ప్రజలవి’... అని చెప్పి, డిటెక్టివ్ సిద్ధార్థ వైపు, ప్రద్యుమ్న వైపు చూసి థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్’ అన్నాడు.
‘మీ లాంటి పోలీస్ అధికారిని ఎవ్వరైనా ప్రేమించకుండా ఉండలేరు. మీ దిష్టి ఇలా పోయింది.’ ఢిల్లీకి బయలుదేరుతూ చెప్పాడు డిటెక్టివ్ సిద్ధార్థ.
- శ్రీసుధామయి
ఇవీ చదవండి: తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?


