శాసనసభ ఎన్నికలకు ముందు నిత్యావసర సరుకుల ధరలపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏమిటి?ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అసాధారణ రీతిలో ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే ఏ సాకులు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు ఎల్లో మీడియా బాండ్ బాజా వాయిస్తోంది. ధరల నియంత్రణకు ఏమి చేస్తున్నది మాత్రం తెలియడం లేదు.
ధరాఘాతానికి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే ధరలు ఎలా పెరిగాయో గమనించండి. సన్నబియ్యం ధర 2024 ఏప్రిల్ లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇదే బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలవరకు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వంట నూనెలు అప్పట్లో 90 నుంచి 106 రూపాయల వరకు ఉంటే, ఇప్పుడు 170 నుంచి 195 రూపాయల వరకు ఉంది. అంటే ఏకంగా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పెరగడం అసాధారణమని చెప్పాలి. పంచదార ధర కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. ఉల్లి ధర సుమారు 40 రూపాయలు, ఎండు మిర్చి ధర సుమారు 150 నుంచి 200 రూపాయలకు పైగా పెరగడం ఆందోళన కలిగించే అంశమే. వినియోగదారులపై ఒకరకంగా ధరల పిడుగుపడిన చందమే అనిపిస్తుంది. కందిపప్పు, చింతపండు వంటి సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి.
ఇక ఇసుకను ఉచితం అన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు లారీకి 20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. మద్యం ధరలు పెరగనే పెరగవు అన్నట్లుగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మద్యం ధరలు సైతం పెరుగుతున్న తీరుపై మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు కూడా గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ చార్జీలు కూడా 15 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వీటి ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి అదనంగా వాట్ రూపేణా ఆదాయం సమకూరుతోంది.
ఆయా వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయాలు కూడా అధికం అవుతాయి. అయినా ఏపీలో అప్పులు మాత్రం నానాటికి పెరుగుతున్నాయే తప్ప, అదుపులో ఉండడం లేదు. ఈ ఇరవై ఆరు నెలల్లోనే ఏపీలో అన్ని రకాల అప్పులు కలిసి 3.86 లక్షల కోట్లకు చేరాయి.ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అని అంతా వ్యంగ్యంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులకు సంబంధించి అసలుతో పాటు వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అమరావతి పేరుతో ఇప్పటికే ఏభైవేల కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. అప్పులన్నిటిని ఏమి చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ఉంటే అందరికి తెలిసేది. కానీ అప్పుల వినియోగంపై ఎవరూ ప్రభుత్వ పక్షాన వివరణ ఇవ్వడం లేదు.
ఇంత అప్పు చేసినా ఆయా చిన్న కాంట్రాక్టర్‌లకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జల జీవన్ కాంట్రాక్టర్లు ధర్నా చేసినా ఫలితం దక్కినట్లు లేదు. ఏలూరులో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల వాచ్‌మన్లు ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నది వారి ఆవేదనగా ఉంది. జూనియర్ డాక్టర్ లు తమ స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే ఆంధ్ర సమాజం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో అవినీతి మాత్రం దూసుకుపోతోందని సెంటర్ ఫర్ లిబర్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ సైతం కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎన్డీఏ పనులు ప్రజలలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల గురించి రాయాలంటే చాంతాడంత లిస్టు అవుతుంది.
ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు ఏమని ప్రచారం చేశారో గుర్తు చేసుకోండి.పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తగ్గిస్తామని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోతాయని ప్రచారం చేశారు. కర్నాటకలోని కొన్ని బంకుల వద్దకు వెళ్లి పోటోలు దిగి, అప్పటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు అయితే ధరల రెక్కలు విరిచివేస్తామని ఊదరగొట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క వస్తువు ధర తగ్గలేదు సరికదా.. పెక్కింటి ధరలు అమాంతంగా దాదాపు రెట్టింపు అయ్యాయి.
ఇదే టైంలో రైతులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. పంటలు చేతికి వచ్చినప్పుడు ధరలు పడిపోయి వారంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతుల చేతుల నుంచి పంట వ్యాపారుల వద్దకు చేరాక మాత్రం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణమన్న భావన ఉంది. ఇలాంటి సమయాలలో విజిలెన్స్ అధికారులు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రిస్తారు. కాని ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతోంది తెలియదు. చంద్రబాబు, లోకేశ్‌లు తమ వాగ్దానం ప్రకారం వ్యాట్ ను తగ్గించి ఉండవచ్చు. అది వారి చేతిలో పని. ఎన్నికల హామీ కూడా ఉన్నందున వారు ఆ పని చేసి, సరుకుల ధరలు తగ్గించడానికి ప్రయత్నించి ఉంటే కాస్త పేరు వచ్చేది. కానీ వారు ఆ పని చేయడం లేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలను ఢోకా చేసినట్లే కదా అన్న విమర్శను విపక్షం చేస్తోంది.
అయితే ఎల్లో మీడియా ఈ ధరల సమస్యను పక్కదారి పట్టించడానికి తంటాలు పడుతోంది. ఇదంతా కరువు వల్ల, యుద్దం వల్ల అని ప్రచారం ఆరంభించాయి. లేకుంటే వ్యాపారుల తీరుతో కష్టాలు వస్తున్నాయని టిడిపి మీడియా అంటోంది. వారిని కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని సలహా ఇవ్వలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా, అప్పట్లోనే ఉక్రెయిన్- రష్యా యుద్దం ఆరంభమైనా, ఏ మాత్రం కనికరం లేకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై పలు వ్యతిరేక కథనాలు రాసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసేవి. చంద్రబాబు, లోకేష్ తదితరులు అచ్చంగా అదే పనిలో ఉండేవారు. అప్పటికన్నా పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే ధరల బారిన పడి ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తను పడుతున్న కష్టం తెలియదా!

కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


