మండాడి మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Mandaadi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Mandaadi Review: సుహాస్‌ విలన్‌గా నటించిన మండాడి మూవీ ఎలా ఉందంటే?

Sep 10 2026 12:44 PM | Updated on Sep 10 2026 1:31 PM

Mandaadi Movie Review And Rating In Telugu

టైటిల్: మండాడి
నటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
నిర్మాత:ఎల్రెడ్ కుమార్
దర్శకుడు: మతిమారన్ పుగళేంది
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ:ఎస్‌.ఆర్‌. కథిర్‌
ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 10, 2024

వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటుడు సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా మండాడి. ఇందులో ఆయన విలన్‌  పాత్రను పోషించగా.. కోలీవుడ్‌ యాక్టర్‌ సూరి హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్‌లోనూ ‘మండాడి’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మరి మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

కథేటంటంటే.. 
శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్‌) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్‌ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు.  ఈ సారి  టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్‌ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్‌ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. రాజీ కోసం మల్లేష్‌ని తీసుకొని కళింగపట్నం వస్తాడు కాళి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. రాజీలో భాగంగా పడవ పోటీలకు దిగుతారు. 

అందులో ఎవరు గెలిస్తే వాళ్లు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుందని కండీషన్‌ పెడతారు. మరి ఈ పోటీలో కాళి తన కళింగ వారియర్స్‌ టీమ్‌ని ఎలా గెలిపించాడు? కాళిని ఓడించేందుకు పులి చేసిన కుట్రలు ఏంటి? అసలు కాళి ఊరి వదిలివెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న కాళి, పులి ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఈ కథలో ఏంజిల్(మహిమా నంబియార్‌), మునయ్య(సత్యరాజ్‌)పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
పడవ పోటీల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌  డ్రామా ఇది. దానికి స్నేహబంధాన్ని, పల్లెటూరి ఎమోషన్‌ని యాడ్‌ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సముద్రంలో పడవల పోటీ అనే పాయింట్‌ కొత్తగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న కథ, సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉన్నాయి. హీరో, విలన్‌ ఒకప్పుడు స్నేహితులుగా ఉండడం.. ఓ కారణంగా విడిపోయి బద్ద శత్రువులుగా మారడం.. చివరకు ఇద్దరి మధ్య పోటీ జరగడం..హీరో గెలవడం.. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ చిత్రం నేపథ్యం కూడా ఇలానే సాగుతుంది. ముగింపులో వచ్చే పడవ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. 

అయితే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీతో పాటు క్లైమాక్స్‌ కూడా ఊహించొచ్చు. అయినప్పటికీ ఒకటి రెండు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథనం చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. హీరో హైదరాబాద్‌ నుంచి కళింగపట్నం వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. పంచాయితీ పెట్టడం.. పడవల పోటీకి రెడీ అవ్వడం ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. 

ఇంటర్వెల్‌  సీన్‌తో సెకండాఫ్‌ పూర్తిగా ఊహించొచ్చు. అయితే కథను ఊహించినా..కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ లో వచ్చే పడవల పోటీ ఎపిసోడ్‌  ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలాగే ప్లాష్‌బ్యాక్‌లో సాగే కాళీ, ఏంజల్‌ ప్రేమ సన్నివేశాలు, కోచ్‌ ముని జట్టుని నడిపించే తీరు..   ఎమోషన్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్‌   బెటర్‌. ముఖ్యంగా పడవ పోటీలకు సంబంధించిన సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానబలం అని చెప్పొచ్చు.  

ఎవరెలా చేశారంటే.. 
కాళి పాత్రకి సూరి పూర్తి న్యాయం చేశాడు.  ఎలాంటి ఎలివేషన్స్‌, హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దానికి తగ్గట్లుగానే సూరి నటించాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు.  ఇక సుహాస్‌  విలన్‌గా మెప్పించాడు. తెరపై కొత్త గెటప్‌లో కనిపిస్తూనే.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏంజల్‌గా మహిమా నంబియార్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. చక్కగా నటించింది.  ఇక సత్యరాజ్‌ కూడా మంచి పాత్రను పోషించాడు. కోచ్‌ మునయ్య పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేష్‌ పాత్ర పోషించిన నటుడితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం కథను ఎలివేట్‌ చేసేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. సముద్రపు సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement