Bigg Boss 10 : వర్షిణికి వాష్‌రూమ్‌ కడిగే పని.. ఎందుకింత శిక్ష? | Bigg Boss 10 Telugu Varshini Gets Permanent Washroom Duty Why Such A Punishment? | Sakshi
Sakshi News home page

Bigg Boss10 Telugu: వర్షిణికి వాష్‌రూమ్‌ కడిగే పని.. ఎందుకింత శిక్ష?

Sep 10 2026 1:53 AM | Updated on Sep 10 2026 7:43 AM

Bigg Boss 10 Telugu  Varshini Gets Permanent Washroom Duty Why Such A Punishment?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ఆట రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు గ్రూపులుగా చర్చలు, బాధ్యతల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మూడో రోజు ఎపిసోడ్‌లో హైరిస్క్‌ జోన్‌, కొత్త కెప్టెన్‌ ఎంపిక, ఇంటి పనుల పంపకం, మానిటరింగ్‌ విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు తనకు లభించిన ప్రత్యేక పవర్ ని షాలిని ఉపయోగించుకుంది.  ఇంతకీ మూడో రోజు ఏం జరిగింది?. అసలు వర్షిణి  శాశ్వతంగా వాష్‌రూమ్‌ కడగాల్సిన అవసరం ఏం వచ్చింది.? నిన్న జరిగిన ఎపిసోడ్ పై ఒక లక్కేద్దాం రండి..!

రెండు టీమ్‌లకు షాక్‌.. హైరిస్క్‌లోకి ఇద్దరు
 బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో బ్లూ, రెడ్‌ టీమ్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేదని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. రెండు టీమ్‌లు విఫలమైనందుకు చెరో కంటెస్టెంట్‌ను హైరిస్క్‌లో పెట్టాలని ఆదేశించాడు. బ్లూ టీమ్‌ నుంచి రామ్‌ ప్రసాద్‌ స్వయంగా ముందుకొచ్చాడు. తనను హైరిస్క్‌లో పెట్టాలని టీమ్‌ సభ్యులకు చెప్పాడు. రెడ్‌ టీమ్‌లో మాత్రం చరణ్‌, షాలినీలలో ఒకరిని ఎంపిక చేయాలని చర్చ జరిగింది. చివరకు టీమ్‌ సభ్యుల నిర్ణయంతో మేరకు చరణ్‌ హైరిస్క్‌లోకి వెళ్లాడు.

కెప్టెన్సీ బాధ్యతలో మార్పు..
హైరిస్క్‌లోకి వెళ్లిన రాంప్రసాద్‌, చరణ్‌లు రెండు టీమ్‌లకు సంబంధించిన కొన్ని హక్కులను కోల్పోయారు. దీంతో బ్లూ టీమ్‌ కెప్టెన్‌ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలో ముఖేశ్‌, త్రిగుణ్‌ పేర్లు వినిపించినప్పటికీ.. ఇక్కడో మ్యాజిక్ జరిగింది. రాంప్రసాద్‌ ప్రతిపాదనతో దేబ్‌జానీకి అవకాశం దక్కింది. టీమ్‌ సభ్యుల అంగీకారంతో ఆమె బ్లూ టీమ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.

పనుల పంపకంలో  వివాదం..
ఇంటి పనుల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వంట పూర్తయ్యే వరకు పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కిచెన్‌ దగ్గరే ఉండాలంటూ త్రిగుణ్‌, వర్ష, సుధీర్‌.. రోహిత్‌కు సూచించారు. అయితే తాను ఎప్పుడూ అక్కడే ఉండటం సాధ్యం కాదని, అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చి పని చేస్తానని రోహిత్‌ చెప్పాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ రెండు టీమ్‌లకు మరో బాధ్యత అప్పగించాడు. ఒక టీమ్‌ ఇంటి పనులు చేయాలని, మరో టీమ్‌ వాటిని పర్యవేక్షించాలని చెప్పాడు. దీంతో ఏ టీమ్‌ ఏ బాధ్యత తీసుకోవాలనే దానిపై చర్చ మొదలైంది.

రోహిత్‌ విషయంలో రచ్చ..
బ్లూ టీమ్‌ తరఫున దేబ్‌జానీ.. తమ టీమ్‌ ఇంటి పనులు చేస్తుందని, రెడ్‌ టీమ్‌ మానిటరింగ్‌ బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే రోహిత్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము కూడా అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.

మాటామాటా పెరగడంతో..
రోహిత్‌ మాటలపై వర్ష, త్రిగుణ్‌, కృష్ణుడు స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధీర్‌తోనూ రోహిత్‌కు గొడవ జరిగింది. తన పని తాను చేయాల్సి ఉండగా సుధీర్‌ ఎందుకు చేశాడంటూ రోహిత్‌ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్‌ జోక్యం చేసుకోవడంతో ‘నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు?’ అంటూ రోహిత్‌ ఘాటుగా స్పందించాడు.

ఎవరికి ఏ పని?
చివరకు దేబ్‌జానీ ఇంటి పనులను కంటెస్టెంట్లకు విభజించింది. వంశీకి కుకింగ్‌ బాధ్యత అప్పగించి, అతనికి సహాయంగా ఝాన్సీని నియమించింది. దేబ్‌జానీ మానిటర్‌గా వ్యవహరించనుంది. షాలినికి వాష్‌రూమ్‌, అమన్‌కు లాండ్రీ, సృష్టికి హౌస్‌ క్లీనింగ్‌ బాధ్యతలు దక్కాయి. సుధీర్‌కు మానిటరింగ్‌ బాధ్యత, రోహిత్‌కు అంట్లు తోమే పని అప్పగించి.. అతడిని త్రిగుణ్‌ పర్యవేక్షించాలని నిర్ణయించారు. చైత్రకు హౌస్‌ క్లీనింగ్‌ బాధ్యత ఇచ్చారు.

 వర్షిణికి వాష్‌రూమ్‌ బాధ్యత..
ఇక ఎపిసోడ్‌లో షాలిని తనకు లభించిన ప్రత్యేక పవర్ ని ఉపయోగించుకోవడం మరో హైలైట్‌గా నిలిచింది. తనకు కేటాయించిన వాష్‌రూమ్‌ క్లీనింగ్‌ బాధ్యతను వర్షిణికి అప్పగించింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం వాష్‌రూమ్‌ బాధ్యత ఆమెనే చేయాలి.  వర్షిణి నవ్వుతూ తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది.

30 సెకన్ల ఛాలెంజ్‌..
అంట్లు తోముతున్న రోహిత్‌ను పర్యవేక్షించే బాధ్యత త్రిగుణ్‌కు దక్కడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. త్రిగుణ్‌ పిలవగానే ‘30 సెకన్లలో వస్తా’ అన్న రోహిత్‌.. ఆలస్యం చేసాడు. నిజానికి ఇక్కడ రోహిత్ కావాలనే అలా చేశాడు .త్రిగుణ్‌ ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

అంతటితో ఆగకుండా రోహిత్‌ పని చేస్తున్న విధానంపై త్రిగుణ్‌ సూచనలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ‘ఇలా చేయాలి.. అలా చేయాలి’ అంటూ తనను మానిటర్‌ చేయడంపై రోహిత్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంట్లోని వాళ్లను కాదు.. నిన్నే మానిటర్‌ చేస్తున్నా’ అంటూ త్రిగుణ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.  ఇలా మూడో రోజుకే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆధిపత్య పోరు, పనుల విషయంలో విభేదాలు బయటపడటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement