‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌! | Bethlehem Kudumba Unit Movie Telugu Review And Rating | Sakshi
Sakshi News home page

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ: రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఎలా ఉందంటే?

Sep 4 2026 11:07 AM | Updated on Sep 4 2026 11:20 AM

Bethlehem Kudumba Unit Movie Telugu Review And Rating

టైటిల్‌: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌
నటీనటులు: నివిన్‌ పౌలి, మమిత బైజు, సంగీత్‌ ప్రతాప్‌, సురేశ్‌ కృష్ణ, వినయ్‌ ఫోర్ట్‌, రోషన్‌ షానవాస్‌ తదితరులు
నిర్మాతలు: దిలీష్‌ పోతన్‌, ఫహద్‌, ఫాజిల్‌, శ్యామ్‌ పుష్కరన్‌ 
తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్‌
దర్శకత్వం: గిరీశ్‌ ఏడీ
సంగీత: విష్ణు విజయ్‌
సినిమాటోగ్రాఫర్‌: అజ్మల్‌ సాబు
విడుదల తేది: సెప్టెంబర్‌ 4, 2026

మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్కడ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్‌ చేస్తున్నారు. అలా ఈ వారం తెలుగులో రిలీజ్‌ అయిన మలయాళ చిత్రమే ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నేడు(సెప్టెంబర్‌ 4) ఈ మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అయింది. ‘ప్రేమలు’ఫేమ్‌ గిరీశ్‌ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
జస్టిన్‌ (నివిన్‌ పౌలీ) ఊర్లో క్యాటరింగ్‌ బిజినెస్‌ రన్‌ చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో వాళ్లంతా హేళన చేస్తున్న పెద్దగా పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి ఆష్లే(మమితా బైజు) ప్రేమిస్తుంది. తొలుత స్నేహం చేసి ఆ తర్వాత అతని మంచితనం చూసి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు జస్టిన్‌కి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఆష్లే తనను ప్రేమించిందన్న విషయం తెలిసి జస్టిన్‌ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రేమ విషయం కొన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచుదామని చెప్పి..ఎవరి కంటా పడకుండా తిరుగుతుంటారు. అయితే ఓ సంఘటన వీరి రహస్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి కుటుంబ సభ్యలు ఎలా రియాక్ట్‌ అయ్యారు? చివరకు వీరిద్దరి ప్రేమ..పెళ్లి వరకు ఎలా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే.. 
చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా.. చిన్న కథకు కూడా కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టి, భారీ హంగులతో సినిమాలు తెరకెక్కిస్తున్న రోజులివి. కానీ సినిమా గొప్పదనం ఎన్ని కోట్లు ఖర్చు చేశామన్నదానిలో లేదు.. తెరపై ఆ కథను ఎంత సహజంగా ఆవిష్కరించామన్నదానిలో ఉంటుంది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్‌ అవ్వాలి.. పాత్రల్లో తనను తాను చూసుకోవాలి.. అప్పుడే ఆ సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడో ఒంటబట్టించుకుంది. స్టార్‌ హీరోలు, భారీ సెట్లు, కోట్ల బడ్జెట్ల కంటే.. కథ, కథనానికే అక్కడ పెద్దపీట. అందుకే అక్కడి నుంచి వచ్చే సినిమాలు భాషల్ని దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంటాయి. అలాంటి సహజత్వానికి అద్దం పట్టే మరో మలయాళ ఆణిముత్యమే ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా. ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. చాలా సింపుల్‌ లవ్‌ స్టోరీ. 

ఏజ్‌ డిఫరెన్స్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన సింపుల్‌ లవ్‌స్టోరీ.కథలో కొత్తదనమేమి లేకున్నా..దాన్ని తెరపై కొత్తగా చూపించడంలో మాత్రం దర్శకుడు గిరీశ్‌ వందశాతం సక్సెస్‌ అయ్యాడు. ప్రేమలు సినిమా మాదిరే ఇందులో కూడా సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్‌ వరకు ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ బోర్‌ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా..జస్టిన్‌, ఆష్లే పరిచయం తర్వాత మనం ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. 

హీరోహీరోయిన్ల పరిచయం..స్నేహితుల మాటలు.. లవ్‌ ప్రపోజల్‌.. ప్రతీది మన చుట్టుపక్కల చూసిన కథనే తెరపై చూపించిన అనుభూతి కలుగుతుంది. షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్‌తో జస్టిన్‌ తమ్ముడు రచ్చ నవ్వులు పూయిస్తుంది.  ఆష్లే లవ్‌ ప్రపోజల్‌ సీన్‌ కూడా ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం హీరో హీరోయిన్ల లవ్‌ చుట్టునే తిరుగుతుంది. ఊర్లో వాళ్లుకి, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం.. చిన్న చిన్న గొడవలు..అలకలు..  కాలేజీ ఎపిసోడ్‌.. అన్ని ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. 

 అయితే అక్కడ నుంచి కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మళ్లీ హాస్యాన్నే ఎంచుకున్నాడు. తన తమ్ముడి లవ్‌స్టోరీ తెలిసిన తర్వాత.. ఆ జంటను కలిపేందుకు జస్టిన్‌ గ్యాంగ్‌ చేసే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. అలాగే హీరో లవ్‌ఫెయిల్యూర్‌ని పైపైనా చూపిస్తూ .. అతని తమ్ముడి లవ్‌స్టోరిని హైలెట్‌ చేస్తూ హాస్యం పండించాడు. హీరోహీరోయిన్ల ప్రేమలో డెప్త్‌ లేకున్నా.. కామెడీ సీన్లతో ఆలోటుని పూడ్చేశాడు. క్లైమాక్స్‌ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ఓ మంచి సినిమా చూశామనే ఫిలింగ్‌ కలుగుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
నివిన్‌ పౌలీ పాత్రలో నివిన్‌ పౌలీ నటించలేదు..జీవించేశాడని చెప్పాలి.తెరపై హీరోలా కాకుండా కామన్‌ మ్యాన్‌గా కనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్‌ ప్రపోజ్‌ చేసినప్పుటు ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా సహజంగా ఉంటాయి. తన ప్రేమను వ్యక్తం పరిచేందుకు పడే సిగ్గు, ఇన్‌ సెక్యూరిటీ.. ప్రతీది చాలా అద్భుతంగా పండించాడు. ఇక ఆష్ల పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది మమిత. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.

నివిన్‌, మమితల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అయింది. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ తమదైన కామెడీతో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విష్ణు విజయ్‌ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా బాగుంటాయి. అజ్మల్‌ సాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ పల్లెటూరి అందాలనే కాదు గోవా అందాలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement