టైటిల్: సీక్రెట్ సోల్జర్
నటీనటులు:నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.
నిర్మాణ సంస్థ: మూన్ లైట్ డ్రీమ్స్
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026
కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మీరావలి అలియాస్ వలి (నిహాల్ కోదాటి), పృథ్వి (సూర్య శ్రీనివాస్) ప్రాణ స్నేహితులు. వలికి దేశభక్తి ఎక్కువ. అయినా కూడా మతం కారణంగా అందరూ అతని దేశ భక్తిని అనుమానిస్తుంటారు. దీంతో తన దేశభక్తిని చాటేందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ అది చేజారిపోతుంది. దీంతో ‘రా’(Raw)లో చేరాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే.. ఇతనిపై ఉగ్రవాది అనే ముద్రపడుతుంది. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ చేయడంలో వలి పాత్ర ఉందని అనుమానిస్తారు. ‘రా’ అధికారులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు తెలుస్తాయి. అవేంటి? కీలకమైన డిఫెన్స్ సమాచారం లీకేజీ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు? వారి లక్ష్యం ఏంటి? దేశం కోసం వలి ఏం చేశాడు? వలికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన తర్వాత పృథ్వి ఏం చేశాడు? ఇద్దరు మిత్రులు ఈ మిషన్‌లో ఎలా భాగమయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమే సీక్రెట్ సోల్జర్. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీకైన సంఘటనకు, నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి ఈ స్పై యాక్షన్ డ్రామాను చాలా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులేవి ఇందులో కనిపించవు.
ఫస్టాఫ్ అంతా ఇద్దరు స్నేహితుల చుట్టూనే తిరుగుతుంది. విభిన్నమైన నేపథ్యలు ఉన్న ఈ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఊర్లో సాదాసీదాగా తిరిగే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. డిఫెన్స్ సమాచారం లీకేజీ ఇష్యూలోకి ఎలా వచ్చారనేది సహజంగా చూపించారు.
ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉగ్రవాదుల మిషన్‌ని అడ్డుకునేందుకు ‘రా’టీమ్ చేసే ప్రయత్నాలు..ఇందులో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు అన్ని ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు హీరో క్యారెక్టర్‌ని తీర్చిదిద్దిన విధానం బాగోలేదు. ఒక స్పైగా అతన్ని చూపించి.. శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులాగే మారేలా చేశారు. ఆ పాత్ర చేసే సాహసాల కంటే శత్రువులు వేసిన ఎత్తుగడలే గొప్పగా చూపించారు. అలాగే దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను శత్రువులు తస్కరించే తీరు కూడా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కొంతమంది గూఢచారుల జీవితాలు ఎలా ముగుస్తాయి? వాళ్లకు దక్కే గుర్తింపు ఎలా ఉంటుంది? అనేది ఇందులో చూపించిన తీరు బాగుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
దేశభక్తి ఎక్కువగా ఉన్న వలి పాత్రలో నిహాల్ కోదాటి చక్కగా నటించాడు. ఇక ధనవంతుడి కొడుకుగా సూర్య శ్రీనివాస్ ఒదిగిపోయాడు. వీరిద్దరు స్నేహబంధం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిజమైన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుకుంటారు? ఆపద వస్తే ఎలా ఆదుకుంటారు? అనేది చాలా సహజంగా చూపించారు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలుతో పాటు రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


