సాక్షి, హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో భాగంగా శనివారం తెలంగాణ గిగ్ వర్కర్స్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన నగరానికి చెందిన గిగ్ వర్కర్ లలిత బైక్‌కు పిలియన్ రైడర్‌గా మారారు. రాహుల్‌ను తన వాహనం ఎక్కించుకుని రైడ్ చేసిన లలిత ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పగిడాల మండలానికి చెందిన యువతి. ఆమె ర్యాపిడోలో పింక్ బైక్‌కు ఫిమేల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ర్యాలీ నేపథ్యంలో తనకు అనుకోకుండా వచ్చిన అవకాశానికి సంబంధించిన అనుభవాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ‘వృత్తిరీత్యా స్టాఫ్‌నర్సు. పార్ట్‌టైమ్‌గా పింక్ బైక్ రైడ్ చేస్తున్నా. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా... తల్లి, సోదరుడు ఉన్నారు. నాకు తొలుత డ్రైవింగ్ రాదు. స్కూటీ కొన్నాకే నేర్చుకున్నా. స్కూటీ కొంటా అన్నప్పుడు ఇంట్లో వాళ్లు తిట్టారు. హైదరాబాద్‌లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. నువ్వో విలేజ్ అమ్మాయివి అన్నారు. తర్వాత నెమ్మదిగా వాళ్లు అర్థం చేసుకున్నారు. గిగ్ వర్కర్‌గా చేస్తున్నానని ఇప్పటివరకు వారికి చెప్పలేదు. నాకు శుక్రవారం ర్యాపిడో నుంచి ఓ కాల్ వచ్చింది.
రాహుల్ గాం«దీని కలవాలంటే అవకాశం ఉందని, నీకు ఆసక్తి ఉందా అని అడిగారు..? ఉందని సమాధానం చెప్పా. అప్పుడు ఎక్కడో దూరం నుంచి చాలామంది మధ్యలో ఉండి రాహుల్ గాంధీని చూస్తానని అనుకున్నా. కానీ ఇలా ఆయన్ను నా స్కూటీ వెనుక ఎక్కించుకుని డ్రైవ్ చేస్తానని అనుకోలేదు. ర్యాలీ ప్రారంభానికి ముందు రాహుల్ నా దగ్గరకు వచ్చి ‘హాయ్ నైస్ టు మీట్ యు.. హౌ ఆర్ యూ’అన్నారు.. ‘ఫైన్ సార్.. ఆప్ కైసేహై’అని అన్నా. తర్వాత నా బైక్ వెనుక కూర్చుని ‘చలో’అన్నారు. దారిలో ‘స్లో... స్లో’అని.. ఓ చోట మాత్రం వేగం పెంచమంటూ ‘మూవ్’అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. రాహుల్‌ను ఎక్కించుకుని, సీఎం పక్క, పోలీసుల మధ్య డ్రైవ్ చేస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యా’అని లలిత చెప్పారు.


