అంజన్న సాక్షిగా అడ్డగోలు దోపిడీ
లెక్కల్లో తేడాలు వెలుగులోకి తెచ్చిన ఆడిట్
విచారణకు వేములవాడ ఈఓకు కమిషనర్ ఆదేశం
ఏళ్లు గడుస్తున్నా మొదలుకాని విచారణ... మళ్లీ ఆ ఊసెత్తని కమిషనరేట్
కొత్తగా వచ్చిన ఉద్యోగి గుర్తించటంతో తాజాగా మరోసారి విచారణకు విజ్ఞప్తి
దేవాలయ హుండీ డబ్బులు లెక్కించి వచ్చిన మొత్తమెంతో రికార్డులో రాశారు. కానీ అంతమొత్తం ఖజానాకు జమ కాలేదు. స్వామివారి ఆర్జిత సేవలకు గాను భక్తుల నుంచి వసూలైన రుసుము రశీదుల ద్వారా చూపినంతగా జమ కాలేదు. ప్రసాదాల కోసం సరుకుల కొనుగోలులో సరుకుల నిల్వకు, పద్దుల్లోని లెక్కలకు మధ్య భారీగా వ్యత్యాసాలున్నాయి. ఈ విధంగా గుడి డబ్బుల్లో గోల్‌మాల్‌కు ఉద్యోగులే బాధ్యులని, తేడా ఉన్న మొత్తం కోట్లలో ఉన్నట్టు ఆడిట్ తేల్చింది.
పదేళ్ల కాలంలో ఇలాంటి అభ్యంతరాలు వరసగా నమోదు అయ్యాయి. విచారణాధికారిని నియమించారు. కాలం గిర్రున తిరిగింది. బాధ్యులైన ఉద్యోగులు పదోన్నతులు పొంది బదిలీ అయి మరోచోట దర్జాగా ‘పని కానిచ్చేస్తున్నారు’. కొందరు ఉద్యోగ విరమణ పొంది ‘విశ్రాంతి’తీసుకుంటున్నారు. కానీ విచారణ మాత్రం మొదలే కాలేదు. అవినీతి ఉద్యోగులపై అంజన్న సాక్షిగా ఈగ వాలనీయని దేవాదాయ శాఖ వింత వ్యవహారమిది.
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల కానుకలు, స్వామివారి నిధులు అడ్డగోలుగా పక్కదారి పట్టాయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ క్షేత్రంలో 2013–14 నుంచి 2017–18 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్ విభాగం తేటతెల్లం చేసింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 210 అభ్యంతరాలను నమోదు చేసింది. ఇవన్నీ లెక్కల్లో తేడాలకు సంబంధించినవే. వీటి విలువను రూ.2.26 కోట్లుగా పేర్కొంది.
ఆ తర్వాత జరిగిన ఆడిట్‌లలో ఆ అభ్యంతరాల సంఖ్య 484కు చేరింది. గోల్‌మాల్ మొత్తం రూ.23 కోట్లకు పెరిగింది. అయినా దేవాదాయ శాఖ కమిషనరేట్ దీన్ని గాలికొదిలేసింది. 2022లో అప్పటి ఈఓ వీటిని చూసి.. భారీ తేడాలున్నాయని, వాటిని వదలటానికి లేదని పేర్కొంటూ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ మేరకు స్పందించిన కమిషనర్ అదే ఏడాది పొరుగున ఉన్న వేములవాడ ఆలయ ఈఓను విచారణాధికారిగా నియమించారు. 2022 ఆగస్టు 1న మెమో నం.బి1/505/2022తో ఆదేశాలు జారీ అయ్యాయి.
కానీ ఆ అధికారి ఎందుకో కదలలేదు..అటు కన్నెత్తి చూడలేదు. 2025లో మరోసారి వేములవాడ ఈఓను కమిషనర్ ఆదేశించారు. అయినా ఊహూ.. తర్వాత ఆ వ్యవహారం కాస్తా అటకెక్కింది. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అయితే ఇటీవల కొండగట్టుకు కొత్త సిబ్బంది వచ్చారు.
అందులో ఓ ఉద్యోగి దీన్ని గుర్తించి విషయాన్ని ఆలయ ఈఓ దృష్టికి తెచ్చారు. ఎప్పటికైనా ఇది ఇబ్బందిగా మరే ప్రమాదం ఉందని భావించి, అప్పటికే రెండు పర్యాయాలు స్వయంగా కమిషనర్ ఆదేశాలు ఉండటంతో, వేములువాడ ఈఓకు కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. వెంటనే విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సిందిగా కోరారు. ఇప్పటికైనా విచారణ ప్రక్రియ ముందుకు కదులుతుందో లేదో వేచి చూడాల్సిందే.
ప్రమోషన్లు, రిటైర్మెంట్లు!
విచారణ అలా సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉండగా, అవినీతికి పాల్పడిన కొందరు అధికారులు దర్జాగా పదోన్నతులు పొందారు. ఇతర ప్రతిష్టాత్మక దేవాలయాలకు బదిలీ అయి విధుల్లో చేరారు. మరికొందరు ఎలాంటి చర్యలు లేకుండానే ఉద్యోగ విరమణ పొంది ఊపిరి పీల్చుకున్నారు. అంజన్న నిధులను స్వాహా చేసిన నిందితులను కాపాడేందుకే దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు విచారణ ప్రక్రియను తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దేవాదాయ శాఖలో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటాన్ని ఆసరా చేసుకుని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆడిట్‌లో దొరికిన ఉద్యోగులను కాపాడటం, ఏసీబీకి చిక్కిన అధికారులకు పదోన్నతులు కల్పించి అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కలి్పంచటం లాంటివి ఎన్నో జరుగుతున్నాయని, కేసులు పరిష్కారమయ్యేవరకు లూప్‌లైన్‌లో ఉంచకుండా, ఏకంగా పెద్ద దేవాలయాలకు ఈఓలుగా నియమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


