10కి 8 ‘కోత’లే! | Nearly 83 Percentage of Pregnant Women in Telangana Private Hospitals Undergo C-Sections | Sakshi
Sakshi News home page

10కి 8 ‘కోత’లే!

Nov 16 2026 1:24 AM | Updated on Nov 16 2026 1:24 AM

Nearly 83 Percentage of Pregnant Women in Telangana Private Hospitals Undergo C-Sections

అవసరం కన్నా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సిజేరియన్లు 

రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏకంగా 83.9 శాతం

ఏడు జిల్లాల్లో 90 శాతంపైనే..

కామారెడ్డిలో అత్యధికంగా 95.2 శాతం

తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా 62.2 శాతం సి–సెక్షన్లు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గిపోతున్న ప్రసవాలు 

వైద్యులు, సిబ్బంది కొరత, ప్రసూతి సేవల్లో సమస్యలే కారణం!

సాక్షి, హైదరాబాద్‌: నెలలు నిండిన గర్భిణుల్లో సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే సిజేరియన్‌ అంటున్నారా? గర్భిణి పరిస్థితి, ఆరోగ్యం కంటే ఆసుపత్రుల ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా మారుతున్నాయా? రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాల గణాంకాలు చూస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో కలిపి 62.2 శాతం ప్రసవాలు శస్త్రచికిత్స ద్వారానే జరుగుతుండటం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ రేటు ఏకంగా 83.9 శాతానికి చేరడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.

ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ప్రతి 10 మంది గర్భిణుల్లో దాదాపు 8 మందికి కడుపు కోసి బిడ్డను బయటకు తీస్తుండటం విస్మయపరుస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించి, సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేందుకు కొంత మేర కృషి జరిగినా.. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకుంటే గతంలో లభించే ఆర్థిక ప్రయోజనం, ప్రోత్సాహకాలు ఇప్పుడు లేకపోవడంతో వ్యయ ప్రయాసలకోర్చి అయినా గర్భిణులు ప్రైవేటునే ఆశ్రయిస్తున్నారు.

దీనికి తోడు క్షేత్రస్థాయిలో గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్‌సీ, యూహెచ్‌సీ సిబ్బంది కొందరు ప్రైవేటు నర్సింగ్‌ హోంలకు సిఫారసు చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇలా వచ్చేవారితో పాటు నేరుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే వారికి కూడా ఎంతవరకు అవసరం అనేది చూడకుండా ఎడాపెడా సిజేరియన్లు చేసేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య తగ్గుతుండగా..ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 

ప్రభుత్వ దవాఖానాల్లో ఇలా.. 
    ఎంసీహెచ్‌ కిట్‌ పోర్టల్‌లో నమోదైన వార్షిక వివరాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వాటా 2022–23లో 53.97 శాతం ఉండగా, 2023–24లో 50.81 శాతానికి, 2024–25లో 47.20 శాతానికి పడిపోయింది. అంటే 2024–25లో ప్రైవేటు, ఇతర వైద్య కేంద్రాల్లోనే 52.80 శాతం ప్రసవాలు జరిగాయి. 2025–26లో ప్రభుత్వ ఆసుపత్రుల వాటా స్వల్పంగా పెరిగి 49.85 శాతానికి చేరింది. 

అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, ప్రసూతి సేవల అందుబాటులో సమస్యలు వంటి అంశాలు కూడా గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లడానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన నాటి నుంచి పీహెచ్‌సీలకు వచ్చే మహిళలు తీరా కాన్పు సమయంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు తేలింది. పీహెచ్‌సీలలోని వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించేలా ప్రోత్సహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

కామారెడ్డిలో కోసేస్తున్నారు..! 
    జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (2023–24) ప్రకారం తెలంగాణలో మొత్తం సిజేరియన్‌ రేటు 62.2 శాతం. జాతీయ సగటు 27.2 శాతంతో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. గత సర్వేలో 60.7 శాతంగా ఉన్న రేటు మరింత పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో 83.9 శాతం ప్రసవాలు సిజేరియన్లే కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ 48.1 శాతం నమోదయ్యాయి.

ఏడు జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రుల సిజేరియన్‌ రేటు 90 శాతం దాటింది. కామారెడ్డిలో అత్యధికంగా 95.2 శాతం, కరీంనగర్‌లో 93.6 , ఆదిలాబాద్‌లో 93.4, మంచిర్యాలలో 92.4, ఖమ్మంలో 90.8, రాజన్న సిరిసిల్లలో 90.7, సిద్దిపేటలో 90.1 శాతంగా ఉంది. ఇక రాజన్న సిరిసిల్లలో 82 శాతం, జగిత్యాలలో 81, కరీంనగర్‌లో 79.9 శాతం ప్రసవాలు శస్త్రచికిత్సల ద్వారానే జరుగుతుండడం ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న సీజేరియన్ల తీరుకు అద్దం పడుతుంది.  

కాసుల కోసమే సి–సెక్షన్‌ 
    ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యేంత వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటే రూపాయి ఖర్చు ఉండదు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులకు ఆయా ఆసుపత్రిని బట్టి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. గర్భిణికి 9 నెలలు నిండిన తరువాత కాన్పు విషయంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు మహిళలను సిజేరియన్‌కే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 

హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ కాన్పుకు రూ.50 వేల లోపు ఖర్చయితే.. సిజేరియన్‌ (సి–సెక్షన్‌) ఆపరేషన్‌కు సుమారు రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు, కొన్నిచోట్ల అంతకుమించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో గది రకం, వైద్యుల ఫీజు, చికిత్స సంక్లిష్టతను బట్టి బిల్లు రూ.2 లక్షలు దాటుతున్నట్లు తెలుస్తోంది.  

అవసరం లేని ఆపరేషన్లపై నిఘా ఏదీ? 
    సిజేరియన్‌ అనేది అవసరమైనప్పుడు తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడే అత్యంత కీలకమైన వైద్య ప్రక్రియ. కానీ అవసరం లేకుండా చేస్తే తల్లులకు ఇన్ఫెక్షన్లు, అధిక రక్తస్రావం, కోలుకోవడంలో జాప్యం, తదుపరి గర్భధారణల్లో సమస్యలు తలెత్తవచ్చు. శిశువుల్లోనూ శ్వాస సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది. అయితే వీటన్నిటిపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి సిజేరియన్‌కు గల వైద్య కారణాలను పరిశీలించడం, ఆసుపత్రుల వారీగా ఆపరేషన్లపై ఆడిట్‌ నిర్వహించడం, సాధారణ కాన్పులకు ప్రోత్సాహకాలు పునరుద్ధరించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలను బలోపేతం చేయడం తక్షణావసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలకు మొగ్గు చూపే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ విని్పస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement