ఇసుక్కొట్టుడు | TGDC Stockyards Witness Massive Cash Collections | Sakshi
Sakshi News home page

ఇసుక్కొట్టుడు

Nov 16 2026 5:06 AM | Updated on Nov 16 2026 5:06 AM

TGDC Stockyards Witness Massive Cash Collections

టీజీఎండీసీ స్టాక్‌ యార్డుల్లో వసూళ్ల దందా! 

ఆన్‌లైన్‌లో డీడీలు చెల్లించినా అదనంగా నగదు ఇస్తేనే ఇసుక లోడింగ్‌ 

ఒక్కో లారీపై రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు వసూళ్లు 

భూపాలపల్లి జిల్లా స్టాక్‌ యార్డుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంపై ఫిర్యాదులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక విక్రయాలు, రవాణాలో పారదర్శకత కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి అన్ని రకాల చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించి, అధికారిక రశీదులతో స్టాక్‌ యార్డులకు వెళుతున్న లారీ యజమానులకు అక్కడ అదనపు వసూళ్ల రూపంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.  

⇒ భూపాలపల్లి జిల్లా పరిధిలోని పలు స్టాక్‌ యార్డుల్లో కాంట్రాక్టర్ల అనుచరులు నగదు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అదనంగా డబ్బులు ఇవ్వకపోతే ఇసుక లోడింగ్‌ చేయకుండా లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నా రని యజమానులు వాపోతున్నారు. మహదేవ్‌పూర్, బీరసాగర్, పలుగుల–3, కన్నెపల్లి తదితర స్టాక్‌యార్డుల్లో ఈ తరహా వసూ ళ్లు జరుగుతున్నాయని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు.  

⇒   ఆన్‌లైన్‌ విధానంలో రహదారి పన్ను, జీఎస్టీ, కాంటా, లోడింగ్‌ తదితర చార్జీలన్నీ కలిపి టన్నుకు రూ.445 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 35 టన్నుల సామర్థ్యమున్న ఒక్కో లారీకి సుమారు రూ.15,600 డీడీ చెల్లించాల్సి వస్తోంది. అయినా, స్టాక్‌యార్డుల వద్ద అదనంగా రూ.2 వేల నుంచి రూ.2,500 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. ఇది కూడా నగదు రూపంలోనే ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు వాపోతున్నారు.  

రూ.1,008 కోట్ల ఆదాయం.. అయినా పర్యవేక్షణ కరువు  
టీజీఎండీసీ ఇసుక విక్రయాల ద్వారా 2024–25లో రూ.738 కోట్లు, 2025–26లో రూ.1,008 కోట్ల ఆదాయం లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పనులకు 9.86 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఇసుక బజార్ల ద్వారా 3.71 లక్షల మెట్రిక్‌ టన్నులు విక్రయించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 70 రీచ్‌ల ద్వారా ఇసుక వెలికితీత, సరఫరా జరుగుతోంది.

ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతున్నా, స్టాక్‌యార్డుల వద్ద వసూళ్ల ఆరోపణలు సంస్థ పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డులను పర్యవేక్షించాల్సిన టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. స్టాక్‌యార్డుల్లో అదనపు వసూళ్లపై లారీ యజమానుల సంఘం ఇప్పటికే టీజీఎండీసీ ఎండీ, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది.  

ఏపీ నుంచి రోజుకు 200 లారీల అక్రమ రవాణా 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోకి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 200 లారీల్లో ఇసుక తరలిస్తున్నట్టు అంచనా. ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా చేసుకొని సరిహద్దుల్లో డంప్‌ చేసి, బిల్లులు, రవాణా అనుమతులు లేకుండానే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఒక్కో లారీలో 45 టన్నుల ఇసుకను నింపేందుకు కూలీలకు రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారు. దీనిని హైదరాబాద్‌ సరిహద్దుల్లో టన్నుకు రూ.1,000 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ నెల 11న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరంలో రూ.60 వేల విలువైన ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement