ఏఐకేఎస్ జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సీపీఎం నేత బృందా కారత్
నల్ల చట్టాలను మళ్లీ దొడ్డిదారిలో తెచ్చే ప్రయత్నం.. వ్యవసాయాన్ని నిర్విర్యం చేసేలా అమెరికాతో ఒప్పందాలు
రైతుల పోరాటంతోనే కేంద్రం పతనం
నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల బహిరంగ సభలో మాజీ ఎంపీ, సీపీఎం నేత బృందా కారత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతు పోరాటాల ద్వారా తిప్పికొట్టిన మూడు నల్ల చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ దొడ్డిదారిన తెచ్చే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ, సీపీఎం నేత బృందా కారత్ పేర్కొన్నారు. తద్వారా వ్యవసాయ రంగాన్ని నిర్వి ర్యం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే కాదు విదేశాల్లోని కార్పొరేట్ శక్తులకు సైతం వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆమె రైతులకు పిలుపునిచ్చారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో బృందా కారత్ మాట్లాడారు.
రైతాంగ సాయుధ పోరాటానికి మతతత్వ రంగు
కిసాన్ సభ ఏర్పడి 90 ఏళ్లు అవుతోందని, నాటి నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదల హక్కుల కోసం పోరాడుతోందన్నారు. నవంబర్ 15న ఆదివాసీ మహా నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ మహాసభలు జరగడం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ఇదే వేదికపై తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ నినాదమైన జల్, జంగల్, జమీన్ స్ఫూర్తిని బృందా కారత్ గుర్తుచేశారు. రైతుల పోరాటాలే దేశభక్తికి అసలైన నిదర్శనమన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కూడా మతతత్వ రంగు పులిమేందుకు బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పోరాట చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
అన్నదాతల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటం
దేశంలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులని, అలాంటిæఅన్నదాతల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బృందా కారత్ మండిపడ్డారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసే ముందు ఎప్పుడైనా రైతులతో చర్చించిందా? అని ప్రశ్నించారు. వ్యవసాయ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టే ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాలతోనే మోదీ ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు.
కుక్క తోక సీదా కాదు.. మోదీ సర్కార్ తీరు మారదు
కుక్క తోక సీదా కావడం ఎంత కష్టమో, మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల స్వభావం మారడం కూడా అంతేనని బృందా కారత్ మండిపడ్డారు. ఎంత మంది కార్పొరేట్ శక్తులు వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా రైతుల హక్కులను ఎప్పటికీ కాలరాయలేరన్నారు. వ్యవసాయ రంగంలో రేయింబవళ్లు కష్టపడుతున్న మహిళా రైతులను ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కేవలం అన్‌పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్స్‌గా చూడటం మహిళా లోకాన్ని అవమానించడమేనన్నారు. మహిళా రైతుల హక్కుల కోసం, సమాన వేతనం కోసం కిసాన్ సభ నిరంతరం పోరాడుతుందన్నారు.
స్వామినాథన్ సిఫారసుల అమలేదీ?
ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే
డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ రైతులను మోసం చేసిందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కలి్పంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయకుండా బడా కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని మండిపడ్డారు.
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలతో 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలనే డిమాండ్‌తో సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తదితరులు ప్రసంగించారు.


