న్యూఢిల్లీ: రామలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ నేపథ్యంలో 200 నుంచి 250 హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ ఆధారిత కెమెరాలతో ముఖాలను గుర్తించే నిఘా వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామలీలా మైదానాన్ని 14 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 8 ప్రాంతాలుగా వీటిని విభజించి సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారు. సభకు సుమారు 50 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భద్రత కోసం 3,000 నుంచి 3,500 మంది పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు.
మైదానం లోపల, బయట, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో 200-250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా దృశ్యాలను పర్యవేక్షిస్తారు. పోలీసులకు బాడీ కెమెరాలు కూడా అందించనున్నారు. ఏఐ ఆధారిత కెమెరాలతో ముఖాలను స్కాన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానానికి మొత్తం ఎనిమిది గేట్లు ఉండగా.. ప్రజల ప్రవేశానికి కేవలం మూడింటినే తెరవనున్నారు. వీఐపీల రాకపోకలకు, సీనియర్ పోలీసు అధికారులకు ప్రత్యేక గేట్లు కేటాయించారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ రెండు దశల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. బ్యాగేజీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా బయటకు పంపేందుకు ప్రత్యేక నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేశారు. సభకు వచ్చినవారు అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు ర్యాలీగా వెళ్లకుండా పోలీసులు పర్యవేక్షించనున్నారు. తాగునీరు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, వాలంటీర్ల ఏర్పాటు బాధ్యతలను నిర్వాహకులకు అప్పగించారు. వాహనాల పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. నవంబర్ 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతి లేదని, రాత్రి సమయంలో మైదానంలో బస చేయడానికి కూడా వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కానిస్టేబుల్ పేపర్ లీక్.. రూ.2.01 కోట్ల ఆస్తులు జప్తు!


