ఇందిర 42వ వర్ధంతి: ఓ చిన్నారి లేఖకు స్ఫూర్తిదాయక సమాధానం! | Indira Gandhi's Timeless Advice To A Young Girl | Sakshi
Sakshi News home page

ఇందిర 42వ వర్ధంతి: ఓ చిన్నారి లేఖకు స్ఫూర్తిదాయక సమాధానం!

Oct 31 2026 11:22 AM | Updated on Oct 31 2026 11:40 AM

Indira Gandhi's Timeless Advice To A Young Girl

న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన లేఖ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కావాలనే ఆశతో ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అధికారం, రాజకీయాలు, పదవుల గురించి కాకుండా నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ప్రజాసేవ ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా 1984లో ఆమె రాసిన ఈ లేఖకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

1983 డిసెంబర్ 28న పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెయింట్ జోసెఫ్ హార్ట్ కాన్వెంట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న దీపకిరణ్ అనే బాలిక ఇందిరాగాంధీకి లేఖ రాసింది. టీవీలో ఆమె ప్రసంగాలను చూస్తున్నానని, అవి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. ఇందిరాగాంధీ చిన్నతనంలో స్విట్జర్లాండ్‌లో ఏ పాఠశాలలో చదువుకున్నారో తెలుసుకోవాలని ప్రశ్నించింది. తాను భవిష్యత్తులో భారత ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఆ చిన్నారి తన లేఖలో వెల్లడించింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో ఇందిరాగాంధీని అడిగింది. బాలిక లేఖకు ఆమె స్పందించారు. 1984 జనవరి 10న సమాధానం రాశారు.

ప్రధాని కావాలనుకునే చిన్నారికి ఇందిరాగాంధీ రాజకీయ వ్యూహాలు, ఎన్నికల గురించి చెప్పలేదు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాలని సూచించారు. నిజాయితీ, కష్టపడి పనిచేయడం, సేవాభావం ఎంతో అవసరమని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు, దేశానికి ఏం చేయగలమనే ఆలోచనతో ముందుకు సాగాలని హితవు పలికారు. చివర్లో ఆ చిన్నారి పాఠశాల ఎలా ఉందని కూడా అడిగారు. ఈ లేఖలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇందిరాగాంధీ చిన్నతనంలో ఆమె తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఇలాగే ఆమెకు లేఖలు రాసేవారు. ఆమె పదేళ్ల వయసులో ముస్సోరీలో ఉన్నప్పుడు భూమి ఎలా ఏర్పడింది? జీవం ఎలా ఆవిర్భవించింది? నాగరికతలు ఎలా అభివృద్ధి చెందాయి? వంటి అంశాలను వివరిస్తూ నెహ్రూ లేఖలు పంపారు. ఆ లేఖలే తర్వాత 'లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిజ్ డాటర్' పేరుతో పుస్తకంగా ప్రచురితమయ్యాయి.

ఇందిరాగాంధీకి సంబంధించిన పత్రాల్లో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు లభించాయి. గతంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరిచిన ఈ లేఖలు ప్రస్తుతం న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ఉన్న ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఆ తర్వాత దీపకిరణ్ జీవితం ఎలా సాగిందనే వివరాలు బహిరంగంగా అందుబాటులో లేవు. కాగా 1984 అక్టోబర్ 31న న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రోడ్డులో ఉన్న తన నివాసంలో భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ కాల్పుల్లో ఇందిరాగాంధీ మరణించారు. ఆమె వయసు అప్పటికి 66 సంవత్సరాలు. అంతకుముందు 1984 జూన్‌లో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం ఈ హత్య జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింస చెలరేగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి: భద్రతా వలయంలో ఢిల్లీ.. 3,500 మంది పోలీసుల మోహరింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement