చాలా మటుకు చిన్న వ్యాపారాలను నిర్వహించే ఎంట్రప్రెన్యూర్లు (ఎంబీఈ) తమ సంస్థల ఆర్థిక అవసరాల కోసం వ్యాపార రుణాలు తీసుకోవడం కన్నా వ్యక్తిగత హోదాలోనే లోన్‌లు తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వ్యక్తిగతంగా చక్కని క్రెడిట్ ప్రొఫైల్ ఉన్నప్పటికీ ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ఈ విధంగా రుణాలు తీసుకున్న ఎంట్రప్రెన్యూర్లు తెలంగాణలో 19.6 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 23.8 లక్షల మంది ఎంట్రప్రెన్యూర్లు ఉన్నారు. తెలంగాణలో వీరిలో 62 శాతం మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 61 శాతం మందికి 730కి పైగా సిబిల్ స్కోర్లు ఉన్నాయి.
ట్రాన్స్‌యూనియన్ సిబిల్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ ఎజాజ్ నజీర్, ఎన్‌ఎస్‌ఐసీ జోనల్ జీఎం (సౌత్ జోన్) సురేశ్ బాబు దీన్ని ఆవిష్కరించారు. దీని ప్రకారం ఎంబీఈ రుణాలకు సంబంధించి తెలంగాణలో 53 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 41 శాతం.. ప్రాపర్టీని తనఖా పెట్టి తీసుకున్నవే ఉన్నాయి.
ఇరు రాష్ట్రాల్లోను ఎంట్రప్రెన్యూర్లకు వ్యక్తిగత రుణాలివ్వడంలో నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు ముందుంటున్నాయి. ఇలాంటి రుణాలు అత్యధికంగా తీసుకున్న సూక్ష్మ వ్యాపార విభాగాల్లో ట్రేడ్, తయారీ తదితర రంగాలు ఉన్నాయి. అనిశ్చితితో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎంబీఈలు డిఫాల్టు కాకుండా క్రమం తప్పకుండా రుణాలను చెల్లించే ధోరణి మెరుగుపడుతుండటం గమనార్హమని నజీర్ తెలిపారు.
మరోవైపు, ఎంట్రప్రెన్యూర్లు వ్యక్తిగత హోదాలో కాకుండా వ్యాపార రుణాలను తీసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాలపరంగాను, ఇతరత్రా వచ్చే ప్రయోజనాలను పొందలేని పరిస్థితి ఉంటుందని సురేశ్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని వ్యాపార రుణాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార రుణాలపై ఎంబీఈల్లో అవగాహన పెంచేందుకు ఎన్‌ఎస్‌ఐసీ ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు సురేశ్ బాబు చెప్పారు. మార్కెట్లు, రుణాలు, ముడి వస్తువులు, టెక్నాలజీ మొదలైన వాటికి సంబంధించి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో లఘు సంస్థలకు తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: ఈరోజు అపరంజి ధర పెరిగిందా? తగ్గిందా?


