పొదుపు నడుస్తుంటే.. అప్పులు పరుగెడుతున్నాయ్‌... | The changing lifestyle of Indians | Sakshi
Sakshi News home page

పొదుపు నడుస్తుంటే.. అప్పులు పరుగెడుతున్నాయ్‌...

Sep 30 2026 5:31 AM | Updated on Sep 30 2026 5:31 AM

The changing lifestyle of Indians

మారిన భారతీయుల జీవనశైలి నేపథ్యం 

నాలుగేళ్లలో పొదుపు 49 శాతం అప్‌

అదే సమయంలో 78 శాతం పెరిగిన అప్పులు 

పెరిగిన ఈఎంఐల భారం

ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడి 

జీతం పడగానే కొంత పక్కన పెట్టడం మన తాతల కాలం నుంచి వచ్చిన అలవాటు. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. భారతీయ కుటుంబాలు ఇప్పటికీ దాచుకుంటున్నాయి. కానీ ఆ పొదుపు పక్కనే మరో లెక్క నిశ్శబ్దంగా పెరుగుతోంది.. అదే ఈఎంఐ.. అప్పుల భారం పెరుగుదల. 2022 జూన్‌ నుంచి ఇప్పటివరకు పొదుపులు 49 శాతం పెరిగితే, ఇదే కాలంలో అప్పులు 78 శాతం పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు బులెటిన్‌ లెక్కలు పేర్కొంటున్నాయి. భారత కుటుంబ జీవనశైలిలో వచ్చిన మార్పును ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. – సాక్షి, అమరావతి

ఇప్పుడు కొను–తర్వాత కట్టు విధానం 
ఒకప్పుడు డబ్బు కూడబెట్టి వస్తువు కొనేవాళ్లం. ఇప్పుడు ముందు వస్తువు తీసుకుని తర్వాత కట్టుకుంటున్నాం. ఫోన్‌ నుంచి ఫ్రిజ్‌ వరకు, బైక్‌ నుంచి కారు వరకు, విదేశీ యాత్ర నుంచి పెళ్లి ఖర్చుల వరకు అన్నిటికీ సులభ వాయిదాలు. యాప్‌ తెరిస్తే చాలు, నిమిషాల్లో లోన్‌.  క్రెడిట్‌ కార్డు స్వైప్‌ చేస్తే ఆ నెల ఖర్చు వచ్చే నెల బిల్లుగా మారుతోంది.  ‘ఇప్పుడు కొను... తర్వాత కట్టు’ అనే పద్ధతి మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. 

పెరుగుతున్న రిటైల్‌ రుణాలు 
ఆర్‌బీఐ ఆరి్థక స్థిరత్వ నివేదిక ప్రకారం కుటుంబాల మొత్తం రుణాల్లో గృహ రుణాలు మినహా ఇతర రిటైల్‌ రుణాల వాటా 58.4 శాతానికి చేరింది. వాటి విలువ పరంగా సుమారు రూ.92 లక్షల కోట్లు. అంటే సగానికి పైగా అప్పు.  ఇల్లు కొనడానికి చేసే అప్పు ఒక ఆస్తిని మిగుల్చుతుంది. కానీ పర్సనల్‌ లోన్, క్రెడిట్‌ కార్డు బకాయి, వినియోగ రుణం ఆస్తిని మిగల్చవు. వీటిపై వడ్డీ కూడా గృహ రుణాల కంటే రెట్టింపు నుంచి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది. 

మారుతున్న పొదుపు విధానం 
డబ్బు దాచుకునే పద్ధతిలోనూ నాలుగేళ్లలో పెద్ద మార్పు వచ్చింది. బ్యాంకు డిపాజిట్లు ఇప్పటికీ అతిపెద్ద భాగమే. కానీ మ్యూచువల్‌ ఫండ్ల వాటా 6.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. షేర్లలో నేరుగా పెట్టుబడి 20.1 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. రెండూ కలిపి ఇప్పుడు 29 శాతం. అంటే మన పొదుపులో దాదాపు మూడో వంతు మార్కెట్‌తో ముడిపడి ఉంది. ఎస్‌ఐపీ సంస్కృతి పెరగడం మంచి పరిణామమే.  

ఏం చేయాలి? 
» నెల ఆదాయంలో ఎంత శాతం ఈఎంఐలకు వెళ్తోందన్నది ప్రధానం.  ఆరి్థక నిపుణుల ప్రకారం ఈఎంఐల వాటా 40 శాతం దాటితే జాగ్రత్త పడాల్సిన సమయం.  అందువల్ల ఈఎంఐల భారాన్ని 40 శాతానికి లోపే ఉంచేలా జాగ్రత్త పడాలి. 
»  అత్యవసర నిధి ఏర్పాటు.  కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన ఉంచుకోవాలి. ఉద్యోగం పోయినా, ఆస్పత్రి ఖర్చు వచ్చినా, మార్కెట్‌ పడిపోయినా ఆ నిధే అండగా నిలుస్తుంది. 
»   పొదుపు ఎంత ముఖ్యమో, ఆ పొదుపు వెనుక ఎంత అప్పు ఉందనేది కూడా అంతే కీలకం. అధిక వడ్డీ అప్పులను సాధ్యమైనంత త్వరగా తీర్చేయడానికి  ప్రాధాన్యతను ఇవ్వాలి.  క్రెడిట్‌ కార్డు బకాయి, పర్సనల్‌ లోన్‌ ముందుగా తీర్చేయడం మేలు. 
»   మార్కెట్‌ పెట్టుబడులు మంచిదే. రిస్క్‌ తీసుకునే ధైర్యం పెరుగుతోందనడానికి ఇది సంకేతం. కానీ మార్కెట్‌ పెరిగితే పెట్టుబడుల విలువ పెరుగుతుంది. పడిపోతే తగ్గుతుంది. ఈ విషయం మరచిపోకూడదు.  

నాలుగేళ్లలో మారిన లెక్క 
»  2026 మార్చి నాటికి దేశంలోని కుటుంబాల ఆర్థిక ఆస్తుల విలువ రూ.490.3 లక్షల కోట్లు  (ఇల్లు, భూమి, 
బంగారం వంటి భౌతిక ఆస్తులు పరిగణనలోకి తీసుకోకుండా).  అప్పులు రూ.158.5 లక్షల కోట్లు.  
»  నాలుగేళ్ల క్రితం సగటున రూ.100 పొదుపు వెనుక రూ.27 అప్పు ఉండేది. ఇప్పుడు అది రూ.32కి చేరింది.  
»    ఈ నాలుగేళ్లలో కొత్తగా కూడబెట్టిన పొదుపు రూ.161 లక్షల కోట్లు కాగా.. కొత్తగా చేసిన అప్పు రూ.69 లక్షల కోట్లు. అంటే నాలుగేళ్లలో కొత్తగా దాచిన ప్రతి రూ.100కు రూ.43 చొప్పున కొత్త అప్పు పెరిగింది. 
»  ఆర్థిక ఆస్తులు (జీడీపీలో) 2022 జూన్‌లో 134.2 శాతం ఉండగా.. 2026 మార్చి నాటికి 141.6 శాతానికి పెరిగాయి. 
»  రూ.100 పొదుపునకు అప్పు 2022 జూన్‌లో రూ.36.40 ఉండగా.. 2026 మార్చి నాటికి రూ.45.80కి పెరిగింది.

ఆందోళన అక్కర్లేదు 
ప్రతి కుటుంబం అప్పుల ఊబిలో ఉందని అనుకోవడం తప్పు. ఇల్లు కొనుక్కుని క్రమంగా రుణం తీరుస్తున్న కుటుంబం వేరు. నెల గడవడానికి అప్పు చేస్తున్న కుటుంబం వేరు. 2026 మార్చి నాటికి దేశంలోని కుటుంబాల ఆర్థిక ఆస్తుల విలువ రూ.490.3 లక్షల కోట్లని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇల్లు, భూమి, బంగారం వంటి భౌతిక ఆస్తులు లేవు. అవి కలిపితే కుటుంబాల మొత్తం సంపద ఇంకా చాలా ఎక్కువే. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మన కుటుంబాల రుణభారం ఇప్పటికీ తక్కువేనని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి.   – విశ్లేషకుల అభిప్రాయం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement