వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం, అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం
రోడ్డుకు ఇరువైపులా, మిద్దెలపై నుంచి జై జగన్ నినాదాలు
చేయి కలపాలని, మాట్లాడాలని పరితపించిన యువత
ఏబీఎం కాలేజీ నుంచి కాకుమాను రాజశేఖర్ ఇంటి వరకు దారిపొడవునా జనమే జనం
కిలోమీటర్ దూరానికి అరగంటకు పైగా సమయం
కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
తిరుగు ప్రయాణంలోనూ జేజేలు పలికిన అభిమానులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అశేష జన వాహిని మధ్య మంగళవారం ఒంగోలులో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఒంగోలుకు వస్తున్నట్లు తెలుసుకుని భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ఉదయం 10 గంటలకే ఏబీఎం కాలేజీ వద్దకు వచ్చారు. కాలేజీ ప్రాంగణంతో పాటు ఆ ప్రాంతంలో రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. తమ అభిమాన నేతను చూడగానే జనాలు కేరింతలు కొట్టారు. వైఎస్ జగన్ అభివాదం చేయగానే.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసి పోవడంతో కాన్వాయ్ ముందుకు కదలడం కష్టంగా మారింది. భారీ జన సందోహం మధ్య తహసీల్దార్ కార్యాలయం, జాయ్ ఆస్పత్రి మీదుగా వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ ఇంటికి చేరుకున్నారు. కాలేజీ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న రాజశేఖర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు అరగంటకు పైగా పట్టింది. మిద్దెలపైకెక్కి జగన్‌ను చూస్తూ సెల్ ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం అంతే ఉత్సాహంతో యువత జేజేలు పలికారు. జై జగన్ నినాదాలు మిన్నంటాయి. జగన్‌ను చూసేందుకు మహిళలు సైతం భారీగా తరలి వచ్చారు.

అభిమాన నాయకుడితో మాట్లాడాలని, కరచాలనం చేయాలని పెద్ద సంఖ్యలో యువత ఎగబడ్డారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా అభిమానులను ఆపటం వాళ్ల తరం కాలేదు. జగన్ పర్యటనలో అధిక సంఖ్యలో యువత తరలి రావడం కనిపించింది. వైఎస్ జగన్ ఒంగోలులో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అడుగడుగునా అదే ఉత్సాహంతో జగన్‌ను అనుసరించారు. కాకుమాను ఇంటి వద్ద గుమిగూడిన యువకులు జగన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీపడ్డారు. జగన్ అక్కడ ఉన్నంత సేపు 45 నిమిషాల పాటు ఆయన కోసం ఎదురు చూస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

ధైర్యంగా ఉండండి
డీఎస్సీ స్కామ్‌పై నిరసన వ్యక్తం చేస్తుండగా జరిగిన పోలీసుల తోపులాటలో గాయపడి, ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. కాకుమాను మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కాకుమాను రాజశేఖర్.. పార్టీకి అందించిన సేవలను వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకిత భావంతో ఆయన పని చేశారన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాజశేఖర్ సతీమణి కాకుమాను షర్మీలా రాజశేఖర్, కుమారులు శశిరాజ్, అమల్‌రాజ్, సోదరుడు రాజ్ శిఖామణి, ప్రశాంతి దంపతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, నేతలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తలశిల రఘురాం, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి వెంకాయమ్మ, జూపూడి ప్రభాకర్, నందిగం సురేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, కేపీ నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, చుండూరు రవిబాబు, కరణం వెంకటేశ్, చింతలపూడి అశోక్‌కుమార్, దద్దాల నారాయణ యాదవ్, జంకె వెంకటరెడ్డి, కనకరావు మాదిగ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేవీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


