టెక్ సీఎం పాలనలో దుస్థితి
ఓటీపీ రాకుండా రింగులు తిరుగుతున్న పోర్టల్
సీడాక్‌కు బకాయిలు చెల్లించకపోవడం వల్లేనా?
సాక్షి, అమరావతి: టెక్నాలజీకి తానే ఆద్యుడినని, భూముల రీ సర్వే తన ఘనతేనని లేని వాటి గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో కనీసం భూముల వివరాలు చూపించే వెబ్‌సైట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తమ భూ రికార్డుల కోసం ఆధారపడే ‘మీ భూమి’ (meebhoomi.ap.gov.in) పోర్టల్ మూగబోయింది. పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ కోసం మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావాలి. కానీ ‘ప్లీజ్ వెయిట్’ అంటూ రింగులు తిరుగుతూనే ఉంటోంది తప్ప ఓటీపీ మాత్రం రావడం లేదు. ఎంతసేపు ఎదురుచూసినా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.
పోర్టల్ తెరవగానే సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి.. కానీ వాటి కిందే ఉన్న లాగిన్ బాక్స్ మాత్రం పనిచేయట్లేదు. ఎస్‌ఎంఎస్ సేవలు అందిస్తున్న సీడాక్ సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పోర్టల్‌ను అంతరాయం లేకుండా నడపడానికి అవసరమైన చిన్న మొత్తాన్నీ చెల్లించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమై విజయవంతంగా సాగిన భూముల రీ సర్వేను తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు.. తన పాలనలో ఉన్న పోర్టల్‌ను సవ్యంగా నడపలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.


