సాక్షి, నల్గొండ జిల్లా: మదర్ డెయిరీలో మరో ముసలం పుట్టింది. జనవరి 9 తేదీన చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 14 రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. గతంలో మదర్ డైరీ చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
తనను చైర్మన్ చేస్తే రూ.12 కోట్ల పాల బిల్లులు చెల్లిస్తానంటూ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారని.. చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మూడు కోట్లు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, 14 రోజుల్లోనే ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ప్రచారమవుతోంది. ప్రస్తుతం మదర్ డెయిరీ రూ. 35 కోట్ల అప్పుల్లో మదర్ డెయిరీ ఉండగా.. పలువురి సొంత రాజకీయ క్రీడలో మదర్ డెయిరీని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలుర వ్యక్తమవుతున్నాయి.


