ఆధునిక జీవనశైలి ప్రభావం ఉన్నా చెంచులు, సవర్లలో మారని జీవక్రియలు.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆధునిక ప్రపంచంలో మనుషుల జీవనశైలి వేగంగా మారుతోంది. నగరాల్లోని ప్రజల ఆహార అలవాట్ల వల్ల పొట్టలో మేలు చేసే సూక్ష్మజీవుల (బ్యాక్టీరియా) స్వరూపమే మారిపోతోంది. కానీ మన గిరిజన తెగల ఆహారంలో స్వల్ప మార్పులు వస్తున్నా వారి శరీరంలోని రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి శతాబ్దాల నాటి సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతోందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చెంచులు, సవర తెగలకు చెందిన ప్రజల్లో ఈ జీర్ణకోశ శక్తులు ఇంకా పదిలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ విజ్ఞాన శాస్త్ర పత్రిక బీఎంసీలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
ఏమిటీ పరిశోధన?
ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అన్వేష్ మైలే, హెచ్.ఎ. నాగరాజారాం, అలేఖ్య పొన్నాడ తదితరులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందుకోసం వారు 2023 నుంచి దాదాపు రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఆరు గిరిజన తెగలకు చెందిన 18–45 ఏళ్ల వయసున్న 234 మంది ఆరోగ్యవంతులైన యువత శరీరంలోని జన్యువులను, పొట్టలోని జీవక్రియలను విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో మనుషుల జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని అరిగించడానికి, రోగాల బారి నుంచి రక్షించడానికి మూడు ప్రధాన రకాల సూక్ష్మజీవుల సమూహాలు (ప్రొఫైల్స్) పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా చెంచు, సవర తెగలకు చెందిన మొత్తం 79 మందిని శాస్త్రవేత్తలు పరీక్షించగా ఏకంగా 65 మంది గిరిజనుల్లో ఇప్పటికీ పూర్తి సంప్రదాయక జీర్ణకోశ పద్ధతులే బలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం 14 మందిలో మాత్రమే ఆధునిక కాలపు పట్టణ సూక్ష్మజీవుల ఆనవాళ్లు కనిపించాయి.
అయితే ఇక్కడే ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. ఆధునిక ప్రభావం పడి జీవనశైలి మారిన ఆ 14 మందిలోనూ పాతకాలపు ఆహారాన్ని అరిగించే శక్తులు, శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లను సొంతంగా తయారు చేసుకొనే జన్యుపరమైన రక్షణ కవచాలు కొనసాగుతున్నాయి. అంటే వారి ఆహార అలవాట్లు మారుతున్నట్లు కనిపిస్తున్నా లోపల ఉన్న శారీరక వ్యవస్థ మూలాలు మాత్రం చెక్కుచెదరలేదు. నల్లమల అడవుల్లో నివసించే చెంచుల్లోని అధిక శాతం మందిలో సంప్రదాయ, ధాన్యాలను అరిగించే శక్తులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాల్లో నివసించే సవర తెగల్లోనూ అత్యధికంగా ఈ శక్తులే కనిపించాయి.
ప్రపంచానికే తెలియని కొత్త సూక్ష్మజీవులు..
ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు మానవ శరీరంలో నివసించే 1,616 రకాల సూక్ష్మజీవులను గుర్తించారు. అయితే ఇందులో అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే.. దాదాపు 813 రకాల బ్యాక్టీరియా ఏ జాతికి చెందినదో, దాని పేరేమిటో ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న ఏ డేటాబేస్‌లోనూ నమోదు కాలేదు.
ప్రకృతితో ముడిపడిన గిరిజనుల జీవన విధానం, వారి శారీరక దృఢత్వాన్ని ఎలా కాపాడుతుందో ఈ పరిశోధన వెల్లడించింది. ఆధునిక వైద్య శాస్త్రానికి, భవిష్యత్తులో రాబోయే రోగాలకు మందులు కనుగొనడానికి మన గిరిజనుల జీవక్రియలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.600కే ఆర్టీసీ వీక్లీ బస్‌పాస్


