కీలక రైల్వే ప్రాజెక్టులపై రద్దు కత్తి! | State government remains unresponsive regarding its share of funding for key railway projects | Sakshi
Sakshi News home page

కీలక రైల్వే ప్రాజెక్టులపై రద్దు కత్తి!

Nov 26 2026 4:28 AM | Updated on Nov 26 2026 4:28 AM

State government remains unresponsive regarding its share of funding for key railway projects

వాటా నిధుల విషయంలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం 

రైల్వే శాఖ చాలాకాలంగా లేఖలు రాస్తున్నా పట్టించుకోని వైనం  

ఇక ఎదురుచూపులు కష్టమనే భావనలో రైల్వే.. తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు 

కొన్ని ప్రాజెక్టులు సొంత నిధులతో పూర్తి చేసే యోచన.. కొన్నిటిని రద్దు చేయడమే ఉత్తమమన్న భావన 

ఉత్తర, దక్షిణ తెలంగాణలోని చాలా ప్రాంతాలకు తీరని నష్టం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మధ్య నెలకొన్న అగాధం కొన్ని కీలక ప్రాజెక్టుల రద్దుకు దారితీసేలా కనిపిస్తోంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల ఆర్థిక చేయూతతో రైల్వే ప్రాజెక్టులను చేపడుతోంది. తాను కొన్ని సొంతంగా నిర్మిస్తూ, మిగతా వాటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కోరుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న, మంజూరై పనులు ప్రారంభించే దశలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించటం లేదు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా లేఖలు రాస్తూ వచ్చిన రైల్వే శాఖ, ఇక వాటిని మనుగడలో ఉంచాలా లేక రద్దు చేయాలా అన్న విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

ఇక వాటా నిధుల విషయంలో స్పష్టత కోసం ఎదురుచూడటం సాధ్యం కాదన్న అర్థ్ధం వచ్చేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ పలు లేఖలు రాసింది. వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కూడా దీనిపై చర్చించిన మీదట, ఇక ఆయా ప్రాజెక్టుల విషయంలో తుది నిర్ణయం తీసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు ఢిల్లీ రైల్వేలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

కాగా ఇప్పటికే పనులు కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టుల విషయంలో, ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులు ఇచ్చేలా లేదని తేల్చుకుని, వాటిని సొంత నిధులతోనే పూర్తి చేయనున్నట్టు రైల్వే ప్రకటించింది. మిగతా వాటిని కూడా అలా కొనసాగించాలంటే ఆర్థిక భారం అడ్డొస్తున్నందున వాటిని ఇక రద్దు చేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయానికి వస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రానికి దీర్ఘకాల ఎదురుచూపుల తర్వాత మంజూరైన కీలక ప్రాజెక్టులు సైతం అటకెక్కుతాయి. 

లోపించిన సమన్వయం 
నిధుల కొరతనో, కేంద్రంతో కొంత బెట్టుతో వ్యవహరించే ధోరణో, సమన్వయ లోపమో గానీ.. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మధ్య సఖ్యత చెడుతూ వచ్చింది. ఒకటీ రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో సమావేశాలు జరిగినా, సమన్వయ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం లేదు. సమన్వయ కమిటీ పేరుతో ఒక్క సమావేశం కూడా జరగలేదు. ప్రాజెక్టుల విషయంలో రైల్వే వైపు నుంచి లేఖలు వెళ్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం కరువైందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో కూడా రైల్వే జీఎం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇక నుంచి సమన్వయంతో ఉండేలా చూస్తామన్న హామీ వచ్చినా ఫలితం లేదు.  

ప్రమాదంలో ప్రాజెక్టులు.. 
ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ ప్రాజెక్టు: దీని నిడివి 136 కి.మీ. అంచనా వ్యయం రూ. 4350 కోట్లు. ఈ కొత్త లైన్‌ ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల గుండా వెళుతుంది. బాల్కొండ, బుస్సాపూర్, నిర్మల్‌ – ఇచ్చోడ వంటి ప్రధాన పట్టణాలను రైలు మ్యాప్‌లోకి తీసుకురావొచ్చు. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రయాణ సౌలభ్యం బాగా పెరుగుతుంది. వేరే ప్రాంతాలతో అనుసంధానం మెరుగవుతుంది. దీనిని రాష్ట్ర వాటా ప్రాజెక్టుగా తీసుకోవాలని పదేపదే లేఖల రూపంలో రైల్వే శాఖ కోరినా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో దీనిపై రద్దు కత్తి వేళ్లాడుతోంది.  

డోర్నకల్‌ –గద్వాల్‌ కొత్త రైల్వే లైన్‌: దీని నిడివి 296 కి.మీ. అంచనా వ్యయం రూ. 5,330 కోట్లు. 2023 జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ ఫైనల్‌ లొకేషన్‌ సర్వే మంజూరు చేసింది.  సర్వే పూర్తయింది,  రైల్వే బోర్డుకు డీపీఆర్‌ అందింది. ఈ లైన్‌ దక్షిణ తెలంగాణలోని అనేక కొత్త, అనుసంధానం లేని ప్రాంతాలను కలుపుతుంది  కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూత్‌పూర్‌ మొదలైన ప్రధాన పట్టణాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఇది కీలకమవుతుంది. దీనికి రాష్ట్ర ఆర్థిక భాగస్వామ్యం కింద ఒప్పందం చేసుకునేందుకు రైల్వే శాఖ పదే పదే లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. దీంతో దీన్ని ఆర్థిక భారంగా ఉండే ప్రాజెక్టుల జాబితాలో చేర్చే ప్రమాదం అంచుల్లో ఉంది.  

బోధన్‌ –లాతూర్‌ రోడ్‌ కొత్త రైల్వే లైన్‌:  
దీని నిడివి 129 కి.మీ. అంచనా వ్యయం దాదాపు రూ.2,482 కోట్లు. 2023 జూలైలో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే మంజూరైంది. ఈ లైన్‌ మహారాష్ట్రలోని లాతూర్‌ను ఉత్తర తెలంగాణలోని బోధన్, నిజామాబాద్‌లతో జోడించే అతి దగ్గరి మార్గం అవుతుంది. ఆయా ప్రాంతాల వ్యాపార, వాణిజ్యాలను మరింత మెరుగు పరిచే ప్రాజెక్టు అవుతుంది. దీనికి ఆర్థిక భాగస్వామ్యం కల్పించే విషయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో దీన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది.  

మనోహరాబాద్‌ –కొత్తపల్లి  ప్రాజెక్ట్‌: 
దీని నిడివి 151.36 కి.మీ. సవరించిన అంచనా వ్యయం రూ. 2,780.78 కోట్లు. రైల్వే లైన్‌ వసతి లేని కీలక పట్టణాలు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాలను రైల్వే మ్యాప్‌లోకి తెచ్చి ఆయా ప్రాంతాల ప్రజల ప్రయాణ వసతిని మెరుగు పరిచే ప్రాజెక్టు. ప్రారంభ ఒప్పందం ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ వ్యయంలో 1/3 వంతు పంచుకోవడం, భూమిని ఉచితంగా అందించడంతో పాటు, ప్రాజెక్ట్‌ ప్రారంభమైన తర్వాత మొదటి ఐదు సంవత్సరాలకు అన్యూటీ చెల్లింపునకు అంగీకరించింది. ప్రారంభ అంచనా వ్యయం రూ.1,160.47 కోట్లు కాగా దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.546.96 కోట్లు (భూమి వ్యయం రూ.240.21 కోట్లు సహా) కాగా  రైల్వే వాటా రూ.613.51 కోట్లు. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి పనులు జరుగుతున్నాయి. 

ఇప్పటివరకు మనోహరాబాద్‌ –సిద్దిపేట మధ్య 76 కి.మీ. లైన్‌ అందుబాటులోకి రావటంతో సిద్దిపేటకు రైల్వే సేవలు మొదలయ్యాయి. అయితే భూసేకరణలో జాప్యం సహా పలు కారణాలతో పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.2,780.78  కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.926.93 కోట్లు (భూమి మినహా). కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.431.15 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.495.78 కోట్లు ఇంకా విడుదల కాలేదు. దీంతో రైల్వే శాఖ ఎన్నోమార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కనీసం సవరించిన అంచనాకు ఆమోదం కూడా తెలపలేదు. ఫలితంగా పనుల్లో వేగం మందగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే సిరిసిల్ల వరకు అనుసంధానం కాకుండానే నిలిచిపోయే పరస్థితి ఉందని సమాచారం.   

రైల్వే శాఖ సొంతంగా.. 
ముద్ఖేడ్‌ – మేద్చల్‌ – మహబూబ్‌నగర్‌ – ధోన్‌ వంటి ఇతర ముఖ్యమైన డబ్లింగ్‌ ప్రాజెక్టులు, తెలంగాణలోని వివిధ ముఖ్యమైన స్టేషన్ల వద్ద ప్రతిపాదించిన పలు  బైపాస్‌ లైన్ల పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ ఆలస్యం కారణంగా  మందగించాయి. ఎంఎంటీఎఎస్‌ సేవలను విస్తరించేందుకు 78 కి.మీ. రెండో దశ ప్రాజెక్టు 2012–13 సంవత్సరంలో రూ.816 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు అయింది. ఒప్పందం ప్రకారం, వ్యయంలో 1/3 వంతు రైల్వే, 2/3 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 

ఈ ప్రాజెక్టు ప్రారంభ అంచనా వ్యయం రూ.816 కోట్లు, అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.544 కోట్లు. అయితే నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అమలులో ఆలస్యం జరగడంతో అంచనా వ్యయం రూ.1,305.70 కోట్లకు పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.870.470 కోట్లుగా మారింది. అయితే మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.379.02 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగతా మొత్తం చెల్లించకపోవటం, ఆ విషయంలో స్పందించక పోవటంతో ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా మిగతా మొత్తం వ్యయాన్ని రైల్వే శాఖనే భరించింది.  

ఘట్కేసర్‌ – యాదాద్రి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో దశ  విస్తరణ (3వ లైన్‌) ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు, 2016లో రైల్వే శాఖ మంజూరు చేసింది. ఘట్కేసర్‌ నుంచి  35 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రి వరకు రూ.330 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించేందుకు తొలుత నిర్ణయించారు. తర్వాత రూ.412.26 కోట్లకు సవరించారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  2/3 వంతు వాటా భరించాలి. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు ఫలితంగా పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్ని లేఖలు రాసినా రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవటంతో ఇక సొంతంగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వ శాఖ నిర్ణయించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement