భారత టెకీలకు యూరప్‌ రెడ్‌ కార్పెట్‌ | Several countries offer job seeker visas that make it easier to settle down | Sakshi
Sakshi News home page

భారత టెకీలకు యూరప్‌ రెడ్‌ కార్పెట్‌

Nov 26 2026 5:31 AM | Updated on Nov 26 2026 5:34 AM

Several countries offer job seeker visas that make it easier to settle down

జాబ్‌ సీకర్‌ వీసాలతో సులభంగా స్థిరపడే అవకాశం కల్పిస్తున్న పలు దేశాలు

కఠిన వీసా నిబంధనల వల్ల అమెరికాను వీడుతున్న వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు 

యూరోపియన్‌ దేశాల్లో తగినంత యువ జనాభా లేక వివిధ రంగాల్లో నిపుణుల కొరత  

విదేశీ ఉద్యోగులకు వేతనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న జర్మనీ, ఆ్రస్టియా, నెదర్లాండ్స్‌

సాక్షి, హైదరాబాద్‌ :  ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే భారతీయ యువతకు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ వీసా నిబంధనలు కొత్త దారులను చూపిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా వెళ్లడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ టెకీలు.. ఇప్పుడు అక్కడ ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసాల జారీని కఠినతరం చేయడం, వీసా ఫీజులను భారీగా పెంచేందుకు సిద్ధమవడం, గ్రీన్‌కార్డుల జారీపై ఆంక్షలు విధించడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని యూరోపియన్‌ దేశాలతోపాటు యూఏఈ, తైవాన్, దక్షిణ కొరియా టెక్‌ నిపుణులకు స్వాగతం పలుకుతున్నాయి. 

ఇతర దేశాల వైపు చూపు.. 
జర్మనీ: ఆపర్చునిటీ కార్డ్‌ పొందిన వారిలో 31–32 శాతం మంది భారతీయులే. జారీ అయిన 11,640 ఆపర్చునిటీ కార్డులలో 3,721 వీసాలు భారతీయులకే లభించాయి. భారతీయుల వీసా ఆమోదం రేటు 83 శాతంగా ఉంది. 2024–25 విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో 59,419 మంది భారతీయ విద్యార్థులు జర్మనీలో చేరారు. 
ఐర్లాండ్‌: జారీ చేసిన మొత్తం ఉపాధి పర్మిట్లలో 32 శాతం మనవాళ్లకే దక్కాయి. 2024లో 13,566 మంది, 2025లో 9,947 మంది, ఈ ఏడాదిలో అక్టోబర్‌ నాటికే 10,275 మంది భారతీయులు వర్క్‌ పర్మిట్లు పొందారు. అందులో ఐటీ, కమ్యూనికేషన్‌ రంగం వాటా 12 శాతంగా ఉంది. 
యూకే: వీసా నిబంధనలను కొంత కఠినతరం చేసినప్పటికీ వర్క్‌ వీసాలు పొందుతున్న విదేశీయులలో 13 శాతం వాటాతో భారతీయులదే అగ్రస్థానం. ఏటా 20,000 మందికిపైగా భారతీయ నిపుణులకు స్కిల్డ్‌ వర్కర్‌ వీసాలు లభిస్తున్నాయి. 
కెనడా, యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా భారతీయ వలసదారుల నికర పెరుగుదలలో కెనడాకు ఏటా 3.26 లక్షల మంది, యూ ఏఈకి (దుబాయ్, అబుదాబి) సుమారు 1.58 లక్షలు, ఆ్రస్టేలియాకు 1.37 లక్షలు, నెదర్లాండ్స్‌కు 1.04 లక్షల మంది చొప్పున వివిధ వీసాలపై వెళ్తున్నారు.  

జాబ్‌ ఆఫర్‌ లేకుండానే వీసా..
ఆ్రస్టియా: 18–30 ఏళ్ల భారతీయ యువత కోసం వర్కింగ్‌ హాలిడే ప్రోగ్రామ్‌ అందుబాటులోకి వచ్చింది. జాబ్‌ ఆఫర్‌ లేకుండానే 12 నెలలపాటు పర్యటించవచ్చు. ఈ సమయంలో గరిష్టంగా 6 నెలలు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే వీలుంది. ఏటా 200 మందికి ఈ అవకాశం లభిస్తుంది. 
జర్మనీ: పాయింట్ల విధానం ఆధారంగా ఆపర్చునిటీ కార్డు ఇస్తోంది. డిగ్రీతోపాటు కనీసం 2–5 ఏళ్ల అనుభవం, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ (బ్లాక్డ్‌ అకౌంట్‌లో €5,700–€ 12,000 యూరోలు) ఉంటే ఏడాదిపాటు ఉద్యోగం వెతుక్కోవచ్చు. వారానికి 20 గంటలు పార్ట్‌–టైమ్‌ జాబ్‌ కూడా చేసుకోవచ్చు. 
పోర్చుగల్‌: ఎలాంటి జాబ్‌ ఆఫర్‌ లేకుండానే 120 రోజులపాటు జాబ్‌ సీకర్‌ వీసాతో ఉద్యోగం వెతుక్కోవచ్చు. మరో 60 రోజులు పొడిగించుకునే వీలుంది. ఇందుకు సుమారు €2,280 యూరోలు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూపించాలి. 
స్వీడన్‌: అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌ డిగ్రీ పూర్తి చేసిన భారతీయులు జాబ్‌ సీకర్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌తో 3–9 నెలలపాటు ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఈ వీసా ఉపయోగపడుతుంది. 
యూఏఈ: దుబాయ్, అబుదాబిలలో ఉద్యోగం వెతుక్కోవడానికి 60, 90, 120 రోజుల జాబ్‌ సీకర్‌ వీసా అందిస్తోంది. స్పాన్సర్‌ అవసరం లేకుండానే వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దక్షిణ కొరియా, తైవాన్‌: సాంకేతిక నిపుణులు, గ్రాడ్యుయేట్ల కోసం 6 నెలల కాలపరిమితితో జాబ్‌ సీకర్‌ వీసా మంజూరు చేస్తున్నాయి.

వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌..
యూరప్‌ దేశాల్లో వృద్ధుల జనాభా పెరగడం, యువత తగ్గడంతో ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్‌ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. అమెరికా తరహాలో కాకుండా జర్మనీ, ఆ్రస్టియా, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ బాగుంటుంది. ఏటా 25–30 రోజుల వేతనంతో కూడిన సెలవులు, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం, పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు ఉంటాయి. కుటుంబ సభ్యులను (డిపెండెంట్‌ వీసా) వెంటనే తీసుకెళ్లడానికి, వారికి కూడా పని చేసే హక్కు కల్పించడానికి ఈ దేశాలు సులభమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement