చీరల పంపిణీ అనంతరం మహిళలతో సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు వాకిటి, అడ్లూరి, దామోదర తదితరులు
మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెబితే దివాలా తీయించారు
రూ.8,11,000 కోట్ల అప్పులు తెచ్చారు.. ఎక్కడా రూపాయి పుట్టకుండా చేశారు
అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్
ఇప్పటికే కారు చచ్చింది.. అధికారం పోతే కమలం చచ్చిన పామే.. ఎప్పుడైనా ఉండేది కాంగ్రెస్సే
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే గెలుపన్న సీఎం
రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేయూత పింఛన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘తెలంగాణ వచ్చిన రోజు సోనియాగాంధీ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో, రూ.70 వేల కోట్ల అప్పుతో ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌కు అప్పగించింది. 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పుతో తెలంగాణను అప్పజెప్పితే.. కేసీఆర్, ఆయన కుటుంబం పదేళ్లలో రూ.8,11,000 కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఎక్కడా రూపాయి పుట్టకుండా చేశారు.
ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితి. అయితే 2023 డిసెంబర్ 7న అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరి నుంచి ప్రతినెలా ఒకటో తేదీనే జీతభత్యాలు చెల్లిస్తోంది. ప్రమోషన్లు, బదిలీలతో పాటు నియామకాలు చేపట్టాం. కేసీఆర్ హయాంలో విధ్వంసమైన తెలంగాణను వికాసంలో నడిపిస్తున్నాం..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
గురువారం నల్లమల పర్యటనలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగు, ఆ తర్వాత అచ్చంపేటలో మొత్తంగా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుంది?
‘అధికారం కోసం పుట్టిన పార్టీలు.. అధికా రం కోల్పోతే చచ్చిన పార్టీలు ఉన్నాయి. ఆనాడు జనతా పార్టీ పుట్టింది.. అధికారంలోకి వచ్చింది. అధికారం పోయింది.. ఆ పార్టీ చచ్చిపోయింది. అధికారం పోగానే బీఆర్‌ఎస్ చచ్చింది.. అధికారం పోతే బీజేపీ చచ్చిన పామే. కానీ ఎప్పుడైనా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అసలు రాష్ట్రంలో ఏ ఊర్ల బీజేపీ ఉంది? ఎంతమంది వార్డు మెంబర్లు, సర్పంచ్‌లుగా ఉన్నరు? ఎంతమంది మున్సిపాలిటీల్లో గెలిచిండ్రు? ఇంక రాష్ట్రంలో బీజేపీ వస్తుందంట.
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి రండి.. లెక్కేందో తేలుద్దాం. నాలుగు దశాబ్దా లు చంద్రబాబు తరం, వైఎస్ తరం, కేసీఆర్ తరం పాలించింది. గత పథకాలేవీ ఆపలే.. అదనంగా కొత్తవీ అమలు చేస్తున్నాం. 2030 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు. 90 సీట్లు.. కోటి ఓట్లు లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనేది కాంగ్రెస్ విధానం. అందుకనుగుణంగా ఇందిరాగాంధీ స్ఫూర్తితో మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలిస్తోంది..’అని సీఎం అన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం..
‘వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నడు. మేము వరి పండించండి.. చివరి గింజవరకు కొంటామని చెప్పడమే కాకుండా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నం. 2024 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో ప్రతి ఏటా అత్యధికంగా వడ్లు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అన్ని పంటలకూ మద్ద తు ధర కలి్పంచడమే కాకుండా కొనుగోలు చేస్తున్నాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట నష్టపరిహారం ఇస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేశాం. రైతుల కు ఈ 34 నెలల్లో 1.78 లక్షల కోట్లు ఇచ్చి రైతు రుణం తీర్చుకునే ప్రయత్నం చేసినం.
కేసీఆర్‌ను ఎలా శిక్షించాలో మీరే చెప్పాలి..
అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకుంటాడంట. కొడుకు, అల్లుడు, బిడ్డకు పంచి పెడతడంట. అధికారంలో లేకుంటే ప్రజల్లోకి రాడంట. కేసీఆర్.. ఈ 34 నెలల్లో దాదాపుగా రూ.2 కోట్ల మేర జీతభత్యాలు తీసుకున్నారు కదా.. నిన్న కాక మొన్న మా పోలీసులు రిజిస్టర్‌లో సంతకం పెట్టి బర్త్‌డే ఉందని దావత్‌కు పోతే.. మా అధికారులు వెంటనే వారిని సస్పెండ్ చేశారు. మరి 34 నెలలు జీతాలు తీసుకుని.. 300 మంది పోలీసుల రక్షణ తీసుకుని.. కోట్ల రూపాయ లు సంపాదించుకున్న అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను ఎలా శిక్షించాలో మీరే చెప్పాలి..’అని సీఎం ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు అన్నగా సారె
సభ ముగిసిన తర్వాత రేవంత్ కోటి మంది మహిళలకు ఆకుపచ్చ చీరలు, రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 6.12 లక్షల చేయూత పింఛన్ల పంపిణీని కంప్యూటర్ మీట నొక్కి ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు అన్నగా చీరల రూపంలో సారె పెడుతున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జలాలతో పాలమూరును తడుపుతాం..
పాలమూరు ప్రజలు నన్ను ‘రేవంతన్న’అని ఆప్యాయంగా పిలుస్తుంటే గుండె పులకిస్తోంది. కృష్ణా జలాలతో ఈ నేలను తడపాల్సిన బాధ్యత నాపై ఉంది. బీఆర్‌ఎస్ ఆనాడు సంతకాలు పెట్టి శ్రీశైలం వెనుక నుంచి కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయేలా పాలమూరుకు మరణ శాసనం రాసింది.
811 టీఎంసీల కృష్ణా నదిలో నీళ్లుంటే.. మాకు 299 టీఎంసీలు చాలు, 512 టీఎంసీలు ఆంధ్రోళ్లు తీసుకుపొమ్మని సంతకాలు పెట్టిండ్రు. మిగులు, వరద జలాల్లో 34 శాతం తెలంగాణకు చాలు, 66 శాతం ఆంధ్రోళ్లకు తీసుకొమ్మని చంద్రబాబుకు మామా అల్లుళ్లు తాకట్టు పెట్టారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, కేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా..ఈ రోజు నీళ్లు ఎత్తుత లేవు.. ఆంధ్రకు పోతున్నాయ్.. రాయలసీమకు పోతున్నాయి అని అడుగుతున్నవ్. మీరు పూర్తి చేస్తే ఈ పరిస్థితి ఉండేదా? పాలమూరు బిడ్డగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి తీరుతా..’అని రేవంత్ అన్నారు.
వచ్చే ఏడాది 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
‘తెలంగాణ సంక్షేమం అంటే రాష్ట్రంలో 122 మంది పేద బిడ్డల్ని గ్రూప్–1లో డీఎస్పీలుగా చేశాం. 562 మందికి ఆర్డీఓతో పాటు గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాలిచ్చాం. టీచర్లు, కానిస్టేబుల్, పారామెడికల్ ఇలా 75 వే ల మందికి ఉద్యోగాలిచ్చాం. వచ్చే సంవత్సరంలో ఇంకో 25 వేల ఉద్యో గాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాం. లంబాడాలు, ఆదివాసీల అభ్యున్నతి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కలిపి ఒకటే కమిషన్ ఉండేది. ఇప్పుడు వేర్వేరుగా కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఎస్టీ చైర్మన్‌గా లంబాడాను నియమిస్తాం.


