ఆగమ విజ్ఞాన వారసత్వం | - | Sakshi
Sakshi News home page

ఆగమ విజ్ఞాన వారసత్వం

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

సుప్రభాతం నుంచిఏకాంత సేవ వరకు..

అర్చకులకు స్వామివారి సేవ కేవలం వృత్తి కాదు.. ఆధ్యాత్మిక సాధన. బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి, శుచిశుభ్రతలతో కొండపైకి చేరుకుని సుప్రభాత సేవతో నిత్య కై ంకర్యాలను ప్రారంభిస్తారు. పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరిస్తూ గర్భాలయంలోని మూలవిరాట్టుతోపాటు కౌతుక, స్నాపన, బలి, ఉత్సవ బేరాలకు నిర్ణీత పద్ధతిలో అభిషేకాలు, అలంకరణలు, నైవేద్య సమర్పణలు నిర్వహిస్తారు. సంస్కృత మంత్రోచ్ఛారణలు, దివ్య ప్రబంధ పాశురాల పఠనంతో స్వామివారిని ఆరాధిస్తారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతి క్రతువునూ శాస్త్రోక్తంగా కొనసాగిస్తారు.

భావితరాలకు ఆగమ విద్యాబోధన

ఆధునిక కాలంలోనూ పూర్వీకులు అందించిన ఆగమ సంప్రదాయాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ముక్కెర వంశీకులు పనిచేస్తున్నారు. కుటుంబంలోని తరువాతి తరాలకు చిన్నతనం నుంచే వేద మంత్రాలు, ఆగమ సూత్రాలు, పూజా విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. తాళపత్ర గ్రంథాల్లోని విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఈ వారసత్వం భవిష్యత్‌లోనూ కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. భక్తులకు, భగవంతుడికి మధ్య ఆధ్యాత్మిక వారధిగా నిలుస్తూ క్షేత్ర సంప్రదాయాలకు వారసులుగా సేవలందిస్తున్నారు.

ఏడు కొండల నడుమ.. ప్రకృతి రమణీయమైన రాతి గుహల్లో కొలువైన పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో పూజా సంప్రదాయాలు నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయంటే అందుకు తరతరాలుగా సేవలందిస్తున్న అర్చకుల భక్తి, నిష్టే కారణం. ముఖ్యంగా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాన్ని ప్రాణప్రదంగా కాపాడుతూ, స్వామివారి సేవకే జీవితాలను అంకితం చేసిన ముక్కెర వంశీకుల ప్రస్థానం ప్రత్యేకమైనది. – మదనాపురం

రాజుల కాలం నుంచి ఆగమ సంప్రదాయం

ఆత్మకూరు (అమరచింత) సంస్థానాధీశుల పాలనలో శ్రీ కురుమూర్తి క్షేత్రం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ కాలంలో పాంచరాత్ర ఆగమ, భగవత్‌ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగిన ముక్కెర వంశీకులకు ఆలయ అర్చకత్వ బాధ్యతలు అప్పగించినట్లు కుటుంబ సంప్రదాయం చెబుతోంది. నాటి రాజులు అందించిన తాళపత్ర గ్రంథాలు, రాగి శాసనాల్లోని పూజా నియమాలను అనుసరిస్తూ ఈ వంశీకులు తరతరాలుగా స్వామివారికి కై ంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు వచ్చినా మూల సంప్రదాయాలకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.

సంప్రదాయానికి తరతరాల వారసులు

శతాబ్దాలుగా శ్రీ కురుమూర్తి స్వామి సేవలో ముక్కెర వంశీకులు

రాజుల కాలం నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా పూజా విధానాలు

నిత్య కై ంకర్యాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ఆగమ సంప్రదాయాల పరిరక్షణ

భావితరాలకు శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తున్న అర్చక కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement