● గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
● మద్దిమడుగు వద్ద రూ.159 కోట్లతో సంత్ సేవాలాల్ ఆలయం, విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
● సీఎం రేవంత్‌రెడ్డి
మన్ననూర్/అమ్రాబాద్: కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి బంజారా (లంబాడీ) గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పదర మండలం మద్దిమడుగు పుణ్యక్షేత్రం సమీపంలో రూ.159 కోట్లతో చేపట్టనున్న సంత్ సేవాలాల్ విగ్రహం, ఆలయ నిర్మాణానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి భూమిపూజ చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు మద్దిమడుగుకు చేరుకున్న సీఎం ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రంగాచారి, చైర్మన్ రాములు సీఎంను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. సంత్ సేవాలాల్ విగ్రహం, ఆలయ నిర్మాణానికి సంప్రదాయ పద్ధతిలో బిగ్ బండారు (భూమిపూజ) నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. దేశంలోని అనేక పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనుల పేదరికాన్ని గుర్తించి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సలహాతో 1976లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. అందుకే లంబాడీలు సంత్ సేవాలాల్ చిత్రపటం పక్కన ఇందిరాగాంధీ చిత్రపటాన్ని కూడా పెట్టుకుంటారని అన్నారు. గతంలో ఇందిరమ్మ పేరును అభిమానంతో తమ పిల్లలకు పెట్టుకునేవారని, ఇప్పుడు ఈ తరం వారు ప్రియాంక పేరును పెట్టుకుంటున్నారని గుర్తుచేశారు. మద్దిమడుగు వద్ద కృష్ణా నదిపై ఏపీని కలిపేలా వంతెన నిర్మాణం, ఎగువ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చెన్నకేశవ రిజర్వాయర్ నిర్మాణానికి హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ డిండి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నల్లమల గడ్డపై పుట్టిన తాను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం గర్వంగా ఉందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, బల్‌రాం నాయక్, ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. మద్దిమడుగు ఆలయం వద్ద 16 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ విగ్రహం, ఆలయం నిర్మించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిచ్చానాయక్ కళాబృందం లంబాడీ, తెలుగు భాషల్లో ఆలపించిన పాటలు, నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, అదనపు కలెక్టర్ చెన్నయ్య, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మద్దిమడుగు ఆంజనేయస్వామి పీఠాధిపతి జయరాం తదితరులు పాల్గొన్నారు.


