ముసాయిదా జాబితాలో కొందరు వ్యక్తులకు రెండు ఓట్లు
దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే డ్రాఫ్ట్ రూపకల్పన
కొందరికి నివాసానికి 10–15 కి.మీ. దూరంలో పోలింగ్ స్టేషన్ కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: సూర్య స్రవంతి. తండ్రి పేరు సూర్య రాజేంద్ర కుమార్. మోచీ కాలనీ.. ఈ ఓటరు పేరును బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తాడ్‌బన్ పోలింగ్ కేంద్రం(పార్ట్ నంబర్ 809) ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్ 677, 678తో రెండు పర్యాయాలు ముద్రించారు. ఇదే పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 272, 273 సీరియల్ నంబర్లతో ఎండీ జియాఉల్ హక్ అనే ఓటరు పేరును, 202, 121 సీరియల్ నంబర్లతో కంపె దినేష్ అనే వ్యక్తి పేరును రెండు పర్యాయాలు ముద్రించారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని కేవలం ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి చూస్తేనే పైన పేర్కొన్న లోపాలు కనిపించాయి.
పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వచ్చిన ఫారం–18 దరఖాస్తులను సరైన రీతిలో పరిశీలించకుండానే స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో)లు ముసాయిదా జాబితాను రూపొందించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్), 2026 ప్రక్రియలో విధుల్లో ఉన్న బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌ఓ)తోనే గ్రాడ్యుయేట్ ఓటర్ల దరఖాస్తుల పరిశీలన జరిపించడంతో ఈ లోపాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సెల్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పి.రాజే‹Ùకుమార్ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తుది ఓటర్ల జాబితాలో ఈ పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు ఓట్లా?
పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓటరుగా నమోదు కావాలంటే ఆ నియోజకవర్గం పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఓటరై ఉండాలి. ఇందుకోసం ఓటరు కార్డు (ఎపిక్) నంబర్‌ను సైతం ఫారం–18 దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. తాజాగా ప్రకటించిన ముసాయిదా పట్టభద్రుల శాసన సమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఒకే ఓటరు పేరు, బంధువు పేరు, చిరునామా, ఫొటో, ఎపిక్ నంబర్‌తో కొందరు ఓటర్ల పేర్లు పునరావృతమయ్యాయి.
ఒకే ఎపిక్ నంబర్‌తో ఓటర్ల పేర్లు పునరావృతమైనా ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ గుర్తించకపోవడం సందేహాలకు తావిస్తోంది. మరోవైపు, చాలా మంది ఓటర్లకు వారి నివాసం సమీపంలో పోలింగ్ కేంద్రం ఉన్నా.. 10–15 కి.మీ.ల దూరంలో పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకి దరఖాస్తులను డిసెంబర్ 10 వరకు స్వీకరించి డిసెంబర్ 25వ తేదీలోగా పరిష్కరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఆలోగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల కేటాయింపును పునః సమీక్షించి నివాసానికి సమీపంలో పోలింగ్ కేంద్రం కేటాయించాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది.


