యాపిల్ కంపెనీ తన టెక్నాలజీ ప్రయాణంలో దశాబ్దాలుగా పాటిస్తున్న నిబంధనకు స్వస్తి చెప్పింది. లాప్‌టాప్‌ల్లో టచ్‌స్క్రీన్ ఫీచర్ అవసరం లేదంటూ స్టీవ్ జాబ్స్ కాలం నుంచి వస్తున్న వాదనను పక్కనపెట్టి ఎట్టకేలకు తన మొట్టమొదటి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. హాలిడే షాపింగ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఓ కార్యక్రమంలో భాగంగా యాపిల్ ఈ ప్రకటన చేసింది.
టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు
యాపిల్ తాజా ప్రెజెంటేషన్‌లో ఆవిష్కరించిన కొత్త మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్ అత్యంత అధునాతనమైన ప్రొలెడ్ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. డిస్‌ప్లే ప్యానెల్‌లోనే టచ్ సెన్సార్‌ను అమర్చడం ద్వారా లేటెన్సీని పూర్తిగా తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల వినియోగదారులు స్క్రీన్‌పై నేరుగా వేళ్లతో టచ్ చేయడం, స్వైప్ చేయడం, జూమ్ చేయడం వంటివాటిని సులువుగా చేయవచ్చు. అంతేకాకుండా, స్క్రీన్ పైభాగంలో అమర్చిన ‘డైనమిక్ ఐలాండ్’ ఫీచర్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేయడం, కాల్స్ అటెండ్ చేయడం లేదా ఎయిర్‌డ్రాప్ సేవలను పొందడం మరింత సులభతరమవుతుందని కంపెనీ తెలిపింది.
అధునాతన చిప్‌సెట్లు
ఈ నూతన మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లు శక్తివంతమైన ఎం5 ప్రో, ఎం5 మాక్స్ ప్రాసెసర్‌లతో పనిచేస్తాయి. డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు. అడోబ్ ఆర్‌జీబీ కలర్ సపోర్ట్, మెడికల్ ఇమేజింగ్ మోడ్స్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లు వీటి సొంతం. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 24 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని యాపిల్ వెల్లడించింది. త్రిపుల్ థండర్‌బోల్ట్ 5 పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ, ఎస్‌డీఎక్స్‌సీ స్లాట్, వై-ఫై 7, బ్లూటూత్ 6 కనెక్టివిటీ ఆప్షన్లతో ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి.
ధరలు ఇలా..
టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రొ ప్రారంభ ధర అమెరికా మార్కెట్లో 14-అంగుళాల మోడల్‌కు 2,899 డాలర్లు (భారతీయ మార్కెట్లో సుమారు రూ.3,49,900) నుంచి ప్రారంభమవుతుండగా 16-అంగుళాల మోడల్ ధర 3,399 డాలర్లుగా ఉంది. అత్యుత్తమ ఎం5 మాక్స్ వేరియంట్ల ధరలు దాదాపు 4,799 డాలర్లు వరకు పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా నవంబర్ 6 నుంచి అధికారిక డెలివరీలు మొదలుకానున్నాయి.
ఇదీ చదవండి: రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు విద్యుత్ నిలిపివేత!


