2026–27లో మరింతగా పెరగనున్న తాజా ఎన్‌పీఏలు
అన్‌సెక్యూర్డ్ రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలు కారణం
ప్రైవేట్ రంగ బ్యాంకులపై అధిక ఒత్తిడి
ఇక్రా నివేదిక
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో తాజా మొండి బాకీల (ఎన్‌పీఏ) భారం పెరగనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే అన్‌సెక్యూర్డ్ రిటైల్ రుణాలు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎక్కువగా రుణాలిచ్చిన ప్రైవేట్ రంగ బ్యాంకులపై ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాజాగా ఎన్‌పీఏలుగా మారే రుణాలు 0.8 శాతంగాను, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 2.5 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది.
విలువపరంగాచూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాజా మొండి బాకీలు రూ. 1 లక్ష కోట్లుగా, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నట్లు వివరించింది. గత రెండేళ్లుగా వాటి మొండి బాకీలు అధిక స్థాయిలో ఉంటున్నాయని నివేదిక వివరించింది. కొత్త మొండిబాకీలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ బ్యాంకింగ్ రంగం మెరుగ్గా, లాభదాయకంగానే ఉంటుందని పేర్కొంది. సానుకూల ప్రొవిజినింగ్, సరిపడేంత మూలధన నిల్వలు ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. నివేదికలో మరిన్ని వివరాలు..
→ బ్యాంకింగ్ రంగంలో 2026 జూన్ నాటికి 1.7 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2027 మార్చి నాటికి దాదాపు అదే స్థాయిలో 1.7–1.8 శాతంగా ఉండొచ్చు. అలాగే నికర ఎన్‌పీఏల నిష్పత్తి 2026 జూన్‌లో 0.4 శాతంగా ఉండగా సుమారు అదే స్థాయిలో 0.4–0.5 శాతంగా కొనసాగవచ్చు.
→ పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ వృద్ధి ఆరోగ్యకరంగా 15.1–15.9 శాతం మేర ఉంటుంది. విలువపరంగా చూస్తే అదనంగా రూ. 32.3–33.8 లక్షల కోట్ల మేర రుణ వితరణ ఉండొచ్చు. అయితే, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల రిసు్కలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపరంగా సవాళ్లు ఎదురుకావొచ్చని ఇక్రా పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15.9 శాతంగా నమోదైంది.
→ ద్వితీయార్ధంలో దేశీయంగా మెరుగైన స్థాయిలో డిపాజిట్ల వృద్ధిని సాధించడం కూడా బ్యాంకులకు కీలకాంశంగా ఉంటుంది. వడ్డీ రేట్లు క్రమంగా పెరగనుండటం బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లకు కొంత దన్నుగా నిలుస్తుంది.
→ బాండ్ ఈల్డ్‌లు పెరుగుతుండటం కూడా కార్పొరేట్ల రుణ సమీకరణ నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు. అయితే, కార్పొరేట్ రుణాలు నిలకడగా పుంజుకోవడమనేది .. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌ల మధ్య వ్యత్యాసం తగ్గడం మీద ఆధారపడి ఉంటుంది.
→ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం కొనసాగించవచ్చు. 2027 ఆర్థిక సంవత్సరంలో వాటి ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) 15–17 శాతం, 2028 ఆర్థిక సంవత్సరంలో 14–16 శాతం మేర వృద్ధి చెందవచ్చు. అయితే, వాటి రుణ సమీకరణ వ్యయాలు పెరగవచ్చు.
→ ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్, అలాగే వృద్ధి సాధనకు సంబంధించి ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కలిపి 2027 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 6.9–7.1 లక్షల కోట్ల మేర ఫండింగ్ అవసరం అవుతుంది.


